చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం ఎం.బండపల్లిలో ఉన్న హట్సన్ పాల డెయిరీలో... గురువారం రాత్రి గ్యాస్ లీకైన ఘటన కలకలం రేపింది. ప్రొడక్షన్ యూనిట్లో కార్మికులు విధులు నిర్వహిస్తుండగా.. ఒక్కసారిగా అమ్మోనియా గ్యాస్ లీకైంది. 14 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులంతా మహిళలే. ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన కలెక్టర్ భరత్ గుప్తా, ఎస్పీ సెంథిల్ కుమార్...వారందరికీ మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. తిరుపతికి తరలించారు.
అంతకుముందు ఎం.బండపల్లిలోని హట్సాన్ పాల డైయిరీని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ... సంఘటన జరిగిన తీరును పరిశ్రమ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పాల డైయిరీలో... కూలింగ్ ప్రక్రియలో భాగంగా ఓ పైప్ వెల్డింగ్ చేస్తుండగా అమ్మోనియం లీక్ అయినట్లు పరిశ్రమ సిబ్బంది కలెక్టర్కు వివరించారు. సంఘటనపై విచారణకు ఆదేశించిన కలెక్టర్... జిల్లా పరిశ్రమల శాఖ అధికారి, అగ్నిమాపక శాఖ సంయుక్తంగా విచారణ చేపట్టి నివేదిక అందించాల్సిందిగా ఆదేశించారు. నివేదిక అందిన తర్వాతే... ఇది ప్రమాదమా? పరిశ్రమ నిర్లక్ష్యమా? చెప్పగలుగుతామని కలెక్టర్ తెలిపారు.
గ్యాస్ లీకేజ్ వల్ల.. పరిసర గ్రామాలకు ఎలాంటి ముప్పు ఉండదని.. కలెక్టర్ వివరించారు. భయాందోళనకు లోనుకాకుండా.. ప్రజలంతా ధైర్యంగా ఉండాలని కోరారు. బాధితులకు మెరుగైన వైద్య సాయం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ 27కు వాయిదా