చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఏ రంగంపేట సమీపంలోని శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల ముందు గత ఏడాది నవంబరు 11వ తేదీన అప్పటి తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్‌రెడ్డి, సినీనటుడు మోహన్‌బాబు కలసి అట్టహాసంగా అవుట్‌పోస్ట్ కేంద్రాన్ని ప్రారంభించారు. శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల్లో చదువుతున్న వేలాది మంది విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని నిరంతరాయంగా 24 గంటలు పోలీసు నిఘా ఉంటుందని అవుట్‌పోస్ట్ ప్రారంభం తరువాత ఎస్పీ రమేష్‌రెడ్డి వివరించారు. స్థానిక పోలీసులు ఒకరిద్దరు సిబ్బందిని అడపాదడపా విధి నిర్వహణకు కేటాయించారు. గత నెల రోజులుగా పోలీసు సిబ్బంది ఎవరూ అవుట్ పోస్ట్ విధులకు రాకపోవటంతో అక్కడి తలుపులు శాశ్వతంగా మూతవేశారు.
శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల యాజమాన్యం సుమారు రూ.5 లక్షల మేరకు ఖర్చు చేసి పోలీసులకు అవసరమైన అన్ని వసతులతో అవుట్‌పోస్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు. నిరంతరం విధులు నిర్వహిస్తామన్న పోలీసులు విధులకు దూరం కావటంతో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అవుట్‌పోస్ట్ కేందాన్ని ప్రారంభించిన ఎస్పీ రమేష్‌రెడ్డి బదిలీపై వెళ్లటం, ఆయన స్థానంలో వచ్చిన వెంకటఅప్పలనాయుడుకు విషయం తెలియకపోవటంతో చంద్రగిరి పోలీసులు అవుట్‌పోస్ట్ నిర్వహణను గాలికి వదిలేశారన్న విమర్శలు వస్తున్నాయి. కాగా ఏడాది క్రితం కరోనా భయంతో మూతపడిన విద్యాసంస్థలు పూర్తిగా తెరచుకోవటంతో వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు కళాశాలకు తరలివస్తున్నారు. ఈ తరుణంలో అవుట్‌పోస్ట్ సేవలు ఆగిపోవటం పట్ల విద్యార్థులు, గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి అవుట్‌పోస్ట్ సేవలు నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: అమ్మాయిలకు ఆ పాత చింతపండు కథలు.. ఇక చెప్పకండి..!