రూ.5 కోట్ల విలువైన 11 టన్నుల బరువు ఉన్న 388 ఎర్రచందనం దుంగలను చిత్తూరు జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం చిన్న గొట్టిగల్లు మండలం దేవరకొండ గ్రామం వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా.. ఒక కారు అతివేగంగా ఆపకుండా ముందుకు వెళ్లింది. పోలీసులు కారును వెంబడించి పట్టుకొని తనిఖీ చేయగా.. అందులో 8 ఎర్రచందనం దుంగలను గుర్తించారు. దీనిపై భాకరాపేట పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసి.. అదుపులో తీసుకుని ఒక ఎర్రచందనం స్మగ్లర్ను దర్యాప్తు చేశారు.
స్మగ్లర్ ఇచ్చిన సమాచారంతో చెన్నై నగరంలోని ఆవడి ట్యాంక్ కర్మాగారం వద్ద కన్నన్ వ్యవసాయ క్షేత్రంలో తనిఖీలు నిర్వహించారు. ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు, ఇతర దేశాలకు ఎగుమతికి సిద్ధంగా ఉంచిన సుమారు 11 టన్నుల బరువు ఉన్న 388 ఎర్రచందనం దుంగలు, ఒక లారీ, కారును స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు, వాహనాల విలువ సుమారు రూ.5 కోట్లు ఉంటుందని ఆయన వివరించారు. ఈ కేసులో మనోజ్ కుమార్, అశోక్ కుమార్, శంకర్, దయానంద నాయుడును అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఇదీ చదవండి