కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అధికమవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పాజిటివ్ కేసులకు వైద్య సేవలు అందించడానికి వీలుగా అత్యంత ఆధునిక వైద్య సదుపాయాలు కలిగిన ప్రత్యేక ఆసుపత్రుల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు చేస్తోంది. మెరుగైన మౌలిక వసతులు ఉన్న ఆసుపత్రులను గుర్తించిన ప్రభుత్వం...వాటిని కరోనా ఆసుపత్రులుగా మార్చడానికి అవసరమైన వైద్య పరికరాలను సమకూర్చే పనిలో పడింది.
రాయలసీమ జిల్లాల్లో కరోనా పాజిటివ్ వచ్చే కేసులకు వైద్యం అందించడానికి తిరుపతిలో కరోనా ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నారు. స్విమ్స్‌కు అనుబంధంగా ఉన్న పద్మావతి మహిళా వైద్య కళాశాల బోధనాసుపత్రిని కరోనా ఆసుపత్రిగా మారుస్తున్నారు. 300 పడకల పద్మావతి ఆసుపత్రి ఇంటెన్సివ్‌కేర్ యూనిట్‌లో 40 పడకలు ఉన్నాయి. వెంటిలేటర్లతో పాటు రోగి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించే మానిటర్లు, ఇతర వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వీటికి తోడుగా మరో వంద వెంటిలేటర్లు కొనుగోలు చేయడం ద్వారా 150 పడకల అత్యవసర సేవల విభాగాన్ని ఏర్పాటుకు చర్యలు తీసుకొంటున్నారు.
ఆధునిక వైద్యసేవలు అందించడానికి అవసరమైన పరికరాల కొనుగోలుతోపాటు.. ఆసుపత్రి భవనంలోని రెండంతస్థులను పూర్తి స్థాయిలో ఏసీగా మార్చడానికి అవసరమైన నిధులను తితిదే కేటాయించనుంది. వైద్య పరికరాలతో పాటు ఇతర వసతులు కల్పించడానికి దాదాపు 15 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేశారు. వైద్య సేవలు అందించడానికి అవసరమైన సిబ్బందిని...రుయా ఆసుపత్రి నుంచి డిప్యుటేషన్‌పై నియమించడానికి చర్యలు తీసుకొంటున్నారు. నర్సింగ్, ల్యాబ్ సిబ్బందిని ఒప్పంద ప్రాతిపదికన నియమించడానికి అవసరమైన సాంకేతిక కార్యక్రమాలను ప్రారంభించారు.
కడప జిల్లా కోవిడ్ ఆసుపత్రిగా ఫాతిమా మెడికల్ కళాశాలను ఎంపిక చేసినట్లు కలెక్టర్ హరికిరణ్ ప్రకటించారు. ఇక నుంచి పరీక్షలను రిమ్స్‌లో కాకుండా ఫాతిమా కళాశాలలోనే నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఇదీచదవండి