ప్రధాని మోదీ అధ్యక్షతన దిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశం ద్వారా వచ్చిన అవకాశాన్ని ముఖ్యమంత్రి జగన్ సద్వినియోగం చేసుకుంటూ... ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలు నెరవేరిస్తేనే..రాజకీయపార్టీలు సభలో ఆందోళనలు చేయడం మానేస్తాయని అభిప్రాయపడ్డారు.
ఫిరాయిస్తే అనర్హులుగా ప్రకటించాలి
పార్టీ ఫిరాయింపుల అంశాన్ని... అఖిలపక్ష సమావేశంలో జగన్ ప్రస్తావించారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు అమలు ఎలా ఉందో చూస్తున్నామన్నారు. కిందటి లోక్‌సభలో వైకాపాకు చెందిన ముగ్గురు ఎంపీలు, 23మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని..కొందరు రాష్ట్రంలో మంత్రులయ్యారని చెప్పారు. లోక్‌సభ అసెంబ్లీలోనూ పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదులు చేశామని... ఫలితం లేదని చెప్పారు. ఇది పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని... ప్రజాస్వామ్య పునాదులు, ప్రజల తీర్పును పరిహాసం చేయడమేనన్నారు. పార్టీ ఫిరాయించిన వారిని 90 రోజుల్లో అనర్హులుగా ప్రకటించే అధికారం ప్రిసైడింగ్ అధికారికి ఇస్తూ 10వ షెడ్యూల్‌ను సవరించాలని జగన్ కోరారు.
జమిలీ మాకు ఒకే
జమిలి ఎన్నికల నిర్ణయాన్ని జగన్ స్వాగతించారు. 1999 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నాయని తెలిపారు. ఒకేసారి ఎన్నికల వల్ల ఖర్చులు తగ్గుతాయన్నారు. ఉపఎన్నికలు జరిగినప్పుడు అధికారులు, పోలీసులను అధికార పార్టీ నియంత్రిస్తున్న ఘటనలున్నాయని... ఒకేసారి ఎన్నికలకు మద్దతిస్తున్నామని...జగన్ తెలిపారు. సమాఖ్య స్ఫూర్తితో ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి.. ఈ అంశంలో ప్రధాని మోదీ చొరవ చూపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.