రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు ముగిశాక... ఇంకా రెండు నెలలుంది కదా అనుకున్న నేతల్లో ఇప్పుడు అసలైన టెన్షన్ మొదలైంది. ఫలితాలకు వారం రోజులే ఉంది. గెలుపుపై ఎవరికి వారు పైకి ధీమాగానే ఉన్నా... లోలోపల మాత్రం అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
ఏప్రిల్ 11న ఒకే విడతలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా... ఫలితాలు మే 23న ప్రకటిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ లోపు.. తమ భవిష్యత్తు ఎలా ఉందంటూ.. పలువురు అభ్యర్థులు జ్యోతిష్యులు, సిద్ధాంతుల ఇళ్లకు వెళ్తున్నారు. పోలింగ్ సరళిని బట్టి ఎవరు గెలుస్తారు? రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది? సిట్టింగ్‌లు మళ్లీ గెలుస్తారా... అన్న అంశాలు.. అన్ని వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
పరీక్షల్లో ఫెయిలైతే విద్యార్థులకైతే సప్లిమెంటరీలు, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలు ఉంటాయి. కానీ.. రాజకీయ పరీక్షల్లో ఫెయిలైతే మాత్రం మళ్లీ ఎన్నికలు జరిగే వరకూ ఎదురుచూడాల్సిందే. అందుకే.. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులంతా... తాము విజయం సాధించాలంటూ విద్యార్థుల మాదిరే ప్రార్థనలు చేస్తున్నారు. రాజకీయ పరీక్షలో గెలవాలని కోరుకుంటున్నారు.
ఇదీ చదవండి...