ETV Bharat / state

ఇబ్బందుల కన్నా... విమర్శలే ఎక్కువ బాధించాయి - ap

ఈ దఫా సార్వత్రిక ఎన్నికల నిర్వహణ సందర్భంగా ఈవీఎంల విషయంలో విమర్శలు ఎదుర్కొంటోన్న ఎన్నికల సంఘం.... పోలింగ్ సిబ్బందికి సరైన శిక్షణా ఇవ్వలేదని తెలుస్తోంది. కొత్తగా వచ్చిన వీవీప్యాట్లపై ఎన్నికల విధులకు హాజరైన అధికారులకు అవగాహన లేక క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పడ్డారు. పనిచేసిన సిబ్బంది పట్ల ఉన్నతాధికారులు దారణంగా వ్యవహరించారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కనీసం తిండి, నీళ్లు కూడా లేకుండా పనిచేశామని... పోలింగ్ ఆలస్యం కారణంగా ఓటర్ల తిట్లు తమను బాధించాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇబ్బందుల కన్నా... విమర్శలే ఎక్కువ బాధించాయి
author img

By

Published : Apr 17, 2019, 6:12 AM IST

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. మొరాయించిన ఈవీఎంలు, వివిప్యాట్లతో పోలింగ్ మందకొడిగా సాగి ఓటర్లకు చుక్కలు చూపించింది. క్షేత్రస్థాయిలో వాస్తవాలు వెలికితీస్తే... ఈసీ ప్రణాళికతో వ్యవహరించలేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. గర్భిణులు, బాలింతలకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఉన్నా... చాలాచోట్ల వారికీ విధులు కేటాయించారు. ఈవీఎంల తనిఖీ కోసం అక్కడే మాక్ పోలింగ్ నిర్వహించుకునేందుకు అనుమతించిన అధికారులు... వివిప్యాట్లు సరిగా పనిచేస్తున్నాయో లేదో చూసేందుకు మాత్రం అంగీకరించలేదు.
వసతులు మృగ్యం...
ఈనెల 10వ తేది ఉదయం 8 గంటలకు ఎన్నికల సామగ్రి తీసుకునేందుకు వెళ్లిన సిబ్బంది... వాటిని సమీకరించుకుని సాయంత్రానికి తమకు నిర్దేశించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. అక్కడ సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడ్డారు. ఈవీఎంలు, ఇతర సామగ్రిని మోసేందుకు కూలీలను నియమిస్తామని చెప్పినా... అది అమలు కాలేదు. క్షేత్రస్థాయిలో ఇబ్బందుల కన్నా... విమర్శలే ఎక్కువగా బాధించాయని చెబుతున్నారు. పోలీసులు తక్కువ ఉండటం వల్ల ఎప్పుడేం జరుగుతుందోనన్న భయంతో విధులు నిర్వహించామని అంటున్నారు. వివిప్యాట్ల బ్యాటరీలు తొలగించి సీల్ వేయాలన్న విషయంపైనా చివరి నిమిషంలో ఆదేశాలు రావటంతో గందరగోళానికి గురయ్యామని చెబుతున్నారు. ఎన్నికల సిబ్బందిలో ఎవరికి ఎంత ఇవ్వాలనేది కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించింది. కనీసం ఆ చెల్లింపులు చేయకుండా కొందరు ఉన్నతాధికారులు ఇబ్బంది పెట్టారని ఉద్యోగులు వాపోతున్నారు.

ఇదీ చదవండి...

sample description

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.