గత ప్రభుత్వ అవినీతి ఆరోపణలపై ఏర్పాటైనా మంత్రివర్గ ఉపసంఘంతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ప్రజాధనం జాగ్రత్తగా వినియోగించేలా పాలన జరగాలని సీఎం చెప్పినట్లు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఒక్కో ఎలుకను పట్టేందుకు రూ.6 లక్షలు ఖర్చుపెట్టినట్లు గత ప్రభుత్వం లెక్కలు చూపిందని.. పుష్కరాల్లో షామియానాలు, నీళ్ల ప్యాకెట్లతో సహా ఏదీ వదల్లేదని ఆరోపించారు. అక్రమాలు చేస్తే ఎంతటి వారైనా వదలొద్దని..ఇప్పటికే సీఎం ఆదేశాలు ఇచ్చారని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.
45 రోజుల్లో నివేదిక..
గత ఐదేళ్ల పాలనపై చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయని మంత్రి కన్నబాబు ఆరోపించారు. ప్రజాధనం కాపాడటమే లక్ష్యంగా కమిటీ పని చేయాలని సీఎం జగన్ చెప్పారని అన్నారు. 45 రోజుల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి తెలిపారని మంత్రి వెల్లడించారు. నాలుగైదు రోజులకోసారి మంత్రి వర్గ ఉపసంఘం భేటీ కావాలని సీఎం సూచించినట్లు కన్నబాబు తెలిపారు. ఆగస్టు 1 నుంచి ప్రజాదర్బార్ ప్రారంభించాలని సీఎం నిర్ణయించారని పేర్కొన్నారు. బ్యాంకులు రైతుల రుణాల విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించరాదని మంత్రి కోరారు.