రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా నెల రోజుల కంటే ఎక్కువ సమయం ఉంది. ఈ లోపు పార్టీ తరుఫున పోటీ చేసిన అభ్యర్థులతో చంద్రబాబు నేరుగా మాట్లాడనున్నారు. ఈ నెల 22న అమరావతిలోని ప్రజావేదికలో 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు... 25 మంది అభ్యర్థులతో భేటి కానున్నారు. పోలింగ్ జరిగిన తీరు... ఫలితాలు ఎలా ఉంటాయనే అంశంపై ఇప్పటికే ఒక అంచనాకు వచ్చిన చంద్రబాబు... అభ్యర్థులతో నేరుగా మాట్లాడి ఒక విశ్లేషణకు రానున్నారు.
ఎన్నికల సంఘం తీరుపై చర్చించే అవకాశం...
పోలింగ్ రోజు నుంచీ ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న చంద్రబాబు... అభ్యర్థులను అడిగి ఆయా నియోజకవర్గాల్లో ఏ విధంగా ఓటింగ్ జరిగిందనేది తెలుసుకోనున్నారు. ఈవీఎంలు మొరాయించడం... కొన్ని చోట్ల తెదేపా నేతలే లక్ష్యంగా దాడులు జరగడం... అర్ధరాత్రి వరకు పోలింగ్ జరగడం వంటి పరిణామాలపై మంతనాలు జరపనున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం ఓటర్లు బలంగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లోనే ఈవీఎంలు మొరాయించాయనేది తెదేపా వాదన. దీనిపైనా చర్చ జరిగే అవకాశముంది.
ఓటింగ్ ఎవరికి అనుకూలంగా ఉంది...
పోలింగ్ ముగిశాకా చాలా మంది నేతలు నియోజకవర్గాల్లోనే ఉండి ఓటింగ్ ఎవరికి అనుకూలంగా... ఎవరికి వ్యతిరేకంగా జరిగిందనే దానిపై దృష్టిసారించారు. ప్రజానాడిని బట్టి అంచనాలు వేసుకుంటున్నారు. చంద్రబాబు కూడా పోలింగ్ ముగిశాక విశ్రాంతి లేకుండా పాలనవ్యవహరాలపై సమీక్షలు జరుపుతూనే... పొరుగు రాష్ట్రాల్లో తన మిత్రుల పార్టీలకు ప్రచారానికి వెళ్తున్నారు.
ఇవాళ కర్నూలు నేతలతో భేటీ...
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ కర్నూలు జిల్లాకు వెళ్లనున్నారు. ఓర్వకల్లు రాక్ గార్డెన్స్‌లో జిల్లా తెదేపా నేతలతో భేటీకానున్న సీఎం... కర్నూలులో పార్టీ పరిస్థితి, గెలుపు అవకాశాలపై జిల్లా నేతలతో మాట్లాడనున్నారు. అనంతరం అక్కడి నుంచి రాయచూర్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్తారు.