వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తి మహిళా వాలంటీర్‌ను కిరాతకంగా చంపిన ఘటన బాపట్ల జిల్లా వేమూరు మండలం చావలిలో చోటుచేసుకుంది. చావలి గ్రామానికి చెందిన దొప్పలపూడి శారద(27)తో అదే గ్రామంలోని మేనమామ ధర్మారావుకు 2008లో వివాహం జరిగింది. శారద స్థానికంగా వాలంటీర్‌గా పనిచేస్తుంది. 'చావలి గ్రామానికే చెందిన పద్మారావుతో శారదకు వివాహేతర సంబంధం ఉంది. శారదపై అనుమానంతో పద్మారావు ఆరు నెలల క్రితం గ్రామ సచివాలయం వద్ద ఆమెపై చేయిచేసుకున్నాడు. ఈ విషయమై అప్పట్లో సచివాలయ మహిళా పోలీసు పద్మారావుపై వేమూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా మందలించారు. దీంతో శారదపై కక్ష పెంచుకున్న పద్మారావు.. ఆదివారం సాయంత్రం ఆమె ఇంటి ముందు పనిచేస్తున్న సమయంలో కత్తితో దాడి చేశాడు. తప్పించుకొని పారిపోతున్నా వెంబడించి మెడ కోయడంతో అక్కడికక్కడే మృతి చెందింది' అని పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి సుగుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కల్యాణ్‌రాజ్ తెలిపారు. శారదకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.
ఇదీ చదవండి: