Law student commits suicide: ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకునేందుకు నగదు డిమాండ్ చేయడం, మానసికంగా వేదించడమే న్యాయ విద్యార్థిని ఆత్మహత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. బాపట్ల పట్టణంలోని పటేల్‌నగర్‌కు చెందిన హనుమంతు శివపార్వతికి ఇద్దరు కుమార్తెలు. కొన్నాళ్ల క్రితం భర్త సాయిరామ్ మృతి చెందడంతో కోర్టులో ఉదోగ్యం చేస్తూ పిల్లల్ని కష్టపడి చదివిస్తున్నారు. పెద్ద కుమార్తె శ్రావణి సంధ్య(20) గుంటూరులోని ప్రైవేటు కళాశాలలో న్యాయవిద్య చివరి సంవత్సరం విద్యార్థిని. సహచర విద్యార్థి తేజతో రెండేళ్ల క్రితం ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయాన్ని ఇంట్లో పెద్దలకు చెప్పారు. కులాలు వేరైనా వివాహం చేయటానికి విద్యార్థిని తల్లి అంగీకరించారు. రెండు నెలలుగా తేజ ప్రవర్తనలో మార్పు వచ్చింది. పెళ్లి చేసుకోవాలంటే రూ.15లక్షలు కట్నంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
Law student commits suicide: అంత నగదు ప్రస్తుతం తమ వద్ద లేదని శ్రావణిసంధ్య చెప్పారు. పెళ్లి చేసుకోవాలంటే నగదు తీసుకురావాలని.. లేకుంటే తనను మరిచిపొమ్మని తేజ చెప్పటంతో తట్టుకోలేకపోయింది. మానసిక కుంగుబాటుకు గురై ఇంట్లోనే ఉంటోంది. తల్లి శివపార్వతి, సోదరి దుర్గాభవాని ధైర్యం చెబుతున్నా శ్రావణి సంధ్య గదిలో ఒంటరిగా ఉంటూ రోదించేది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఇంట్లో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రులకు కుటుంబసభ్యులు తీసుకెళ్లినా చేర్చుకోలేదు. స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించింది. కుమార్తె మరణంతో తల్లి శివపార్వతి తీవ్రంగా తల్లడిల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. విద్యార్థిని మృతదేహానికి పోస్టుమార్టం చేసి కుటుంబసభ్యులకు పోలీసులు గురువారం అప్పగించారు. విద్యార్థిని కుటుంబసభ్యులను డీఎస్పీ శ్రీనివాసరావు విచారించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు ప్రియుడు తేజపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై రఫీ తెలిపారు. నిందితుడిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు.
ఇదీ చదవండి: టార్చిలైట్ల వెలుగులో ప్రసవం... పసికందు సైతం అనుభవిస్తున్న కరెంటు కష్టాలు