TENSION AT NARA LOKESH PADAYATRA : తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఉద్రిక్తతల మధ్య సాగుతోంది. ఎన్నికల నియామవళి అనుసరించి ఓటర్లు కాని వ్యక్తులు ఉండకూడదంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. 40వ రోజు(నిన్న) బస చేసిన నందిరెడ్డివారి పల్లెలో మదనపల్లె ఆర్డీవో మురళీ నోటీసులు అందజేశారు. దీంతో లోకేశ్ పాదయాత్రపై సందిగ్ధత నెలకొంది.
మధ్యాహ్నం మూడు గంటల లోపు నియోజకవర్గాన్ని వదిలి వెళ్లిపోవాలని ఆర్డీవో సూచించారు. ఈరోజు పాదయాత్ర ముగిసిన అనంతరం సాయంత్రం కురబలకోట మండలం కంటేవారిపల్లిలో లోకేశ్ బస చేయాల్సి ఉంది. అయితే నేడు బస చేయాల్సిన ప్రాంతం శాసన మండలి ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గ పరిధిలో ఉండటంతో ఉత్కంఠ కొనసాగుతోంది. అధికారుల నోటీసుల నేపథ్యంలో మధ్యాహ్నం మూడు గంటలకు పాదయాత్ర ముగించి ఎక్కడ బస చేస్తారో అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. పాదయాత్ర సిబ్బందికి మినహాయింపుపై ఇంకా అధికారులు స్పష్టత ఇవ్వలేదు.
ఘనస్వాగతం పలికిన నేతలు, కార్యకర్తలు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 41వ రోజు అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో కొనసాగుతోంది. నందిరెడ్డివారిపల్లె విడిది కేంద్రం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. తట్టివారిపల్లె, అంగళ్లు మీదుగా పాదయాత్ర కొనసాగుతోంది. అంగళ్లులోకి పాదయాత్ర ప్రవేశించగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.
అంగళ్లులోని యువత, మహిళలు, వృద్దులు లోకేశ్‌ని కలిసి అధికార పార్టీ వల్ల తాము పడుతున్న బాధలను వివరించారు. జగన్ పాలనలో అందరూ బాధితులేనని లోకేశ్ విమర్శించారు. జగన్.. పెట్రోల్, డీజిల్‌పై వేస్తున్న అసాధారణ పన్నుల వలనే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి రాగానే జగన్ అడ్డగోలుగా పెంచిన అన్ని పన్నులు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 6 లక్షల పెన్షన్లు కట్ చేసింది జగన్ ప్రభుత్వమే అని లోకేశ్ ఆరోపించారు.
రాష్ట్రంలో యువత, మహిళల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం మహాపాదయాత్ర ఘనంగా సాగుతోంది. 40 రోజుల పాదయాత్రోలో లోకేశ్ 500కిలో మీటర్లు పూర్తి చేసుకున్నారు. లోకేశ్ పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల భారీ మద్దతు లభిస్తోంది. అధికార పార్టీ పాలనలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను లోకేశ్‌కు వివరిస్తున్నారు. అందరీ సమస్యలను తెలుసుకుంటున్న లోకేశ్.. వారికి భరోసా ఇస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని హామీ ఇస్తున్నారు. లోకేశ్ పాదయాత్రు మహిళలు, యువతల హారతులు ఇచ్చి ఘనస్వాగతం పలుకుతున్నారు. అభిమానులు, కార్యకర్తలు గజమాలలతో సత్కరిస్తున్నారు.
ఇవీ చదవండి: