నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి అభ్యర్థులకు బెదిరింపులు, ఓటర్లకు ప్రలోభాలు, చీకట్లో ఓట్ల లెక్కింపులతో ఫలితాల తారుమారు వంటి యత్నాలను దాటుకొని... ఆ వ్యక్తి సర్పంచ్‌గా విజయకేతనం ఎగరవేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు ఎస్సీ స్థానానికి రిజర్వ్ కావటంతో... సామాన్యులకు మద్దతు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ భావించింది. ఈ క్రమంలోనే 15 ఏళ్లుగా వంట గ్యాస్ డెలివరీ బాయ్‌గా సేవలందిస్తున్న తిరుపాలును ఎంపిక చేసింది. గతంలో తిరుపాలకు ఏ రాజకీయ పార్టీతో కానీ, నాయకులతో కానీ సంబంధాలు లేవు. కేవలం గ్యాస్ బాయ్‌గా ప్రజలతో నిత్యం సంబంధాలు పెంచుకున్న ఆయన... మాజీ మంత్రి పరిటాల సునీత మద్దతుతో పోటీలో నిలిచారు. ప్రజల ఆదరాభిమానాలతోనే తాను సర్పంచిగా గెలిచినట్లు తిరుపాలు చెబుతున్నారు.
డెలివరీ బాయ్‌గా 15ఏళ్లుగా సేవలు...
అన్నిచోట్ల గెలుపొందిన సర్పంచులకు ఇంకా బాధ్యతలు అప్పగించలేదు. అయినా తిరుపాలు ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచే ఉదయాన్నే పంచాయతీ కార్యాలయానికి వెళ్లి పారిశుద్ధ్య కార్మికులతో సమావేశమై పరిస్థితులను తెలుకుంటున్నారు. ఉదయం 9 గంటల వరకు పంచాయతీకి సంబంధించిన పనులు చేసుకొని, తిరిగి తన వృత్తిలోకి అడుగు పెడుతున్నారు. ఆటోలో గ్యాస్ సిలిండర్లు తీసుకొని డెలివరీ కోసం ఇంటింటికి వెళుతున్నారు. తన భర్త సర్పంచి కావడంపై భార్య సావిత్రి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వృత్తిని వదలను..
సర్పంచిగా రాప్తాడు ప్రజల ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూనే.. తనను ఇంతవాడిని చేసిన గ్యాస్ బాయ్ వృత్తిని మాత్రం వదలనని తిరుపాలు గర్వంగా చెబుతున్నారు.
ఇదీ చూడండి. వెటర్నరీ ఆసుపత్రి చెట్టుకింద ఒంగోలు ఎద్దు..!