పట్ణణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(టిడ్కో) రివర్స్ టెండరింగ్ ప్రక్రియ రెండో విడతలో రూ. 46 కోట్ల ఆదా అయ్యాయని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. గత నెలలో నిర్వహించిన తొలివిడత రివర్స్ టెండరింగ్‌లో సుమారు రూ.106 కోట్లు ఆదా అయినట్లు వివరించారు. అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో 6, 496 గృహాలకు టిడ్కో ఆధ్వర్యంలో శుక్రవారం రూ.317.45 కోట్లతో టెండర్లు పిలువగా రూ. 271.42 కోట్లతో పనులు చేపట్టేందుకు గుత్తేదారులు బిడ్లు దాఖలు చేసినట్లు మంత్రి తెలిపారు. అంచనా కన్నా 14.5 శాతం తక్కువకే పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు వచ్చినట్టు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో సత్ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. ఈ విధానం ద్వారా ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా నియంత్రించగలుగుతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
అనంతపురం జిల్లాలో ఫేజ్ 2లో భాగంగా రూ. 220.69 కోట్ల అంచనాతో 4,608 ఇళ్ల నిర్మాణ పనులకు చేపట్టిన రివర్స్‌టెండరింగ్ ప్రక్రియలో ఎన్‌జేఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ రూ.188.69 కోట్లకు బిడ్డు దాఖలు చేసి ఎల్ 1గా నిలిచింది. గతంలో ఇక్కడ చదరపు అడుగు నిర్మాణానికి రూ.1596 ఖరారవగా ఇప్పుడు అది రూ.1365కు తగ్గింది. పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.96.76 కోట్ల అంచనా వ్యయంతో 1888 ఇళ్లకు సంబంధించిన ప్రక్రియలో శ్రద్ధ సబూరి ప్రాజెక్టు సంస్థ రూ. 82.73 కోట్లకు బిడ్ దాఖలు చేసి ఎల్1గా నిలిచింది. గతంలో ఇక్కడ చదరపు అడుగుకు రూ. 1602కు ఖరారవగా ఇప్పుడు అది రూ.1370 కు తగ్గింది' అని ప్రకటనలో మంత్రి బొత్స పేర్కొన్నారు.
ఇదీ చదవండి