'పుట్టకనుమతో ప్రయోజనం లేదంటా'
పేరూరు కాలువపై మంజూరైన రెండు జలాశయాల్లో పుట్టకనుమతో పెద్దగా ప్రయోజనం ఉండదని హంద్రీనీవా ప్రాజెక్టు అధికారులు అంటున్నారు. పుట్టకనుమ కోసం రూ.200 కోట్లు కేటాయించారు. నీటి నిల్వ 0.61 టీఎంసీలేనని.. దీనిద్వారా కేవలం 6,200 ఎకరాలకే నీరందుతుందని ఇంజినీర్లు కొత్త ప్రతిపాదనలో తెలిపారు. అయితే ఈ ఆయకట్టును పేరూరు కాలువ కింద ఇచ్చి.. ఆ సొమ్ముతో పుట్టకనుమ బదులుగా మరో మూడు చోట్ల కొత్తగా జలాశయాలు నిర్మించే ప్రణాళిక చేశారు. గతంలో మంజూరైన సోమలవాండ్లపల్లి, పుట్టకనుమ జలాశయాలు కనగానపల్లి మండలంలో ఉన్నాయి. వీటిలో పుట్టకనుమను రద్దుచేసి పేరూరు కాలువపైనే ఆత్మకూరు మండలంలో ముట్టాల వద్ద జలాశయాన్ని నిర్మిస్తున్నారు. అదే మండలంలో తోపుదుర్తి వద్ద, చెన్నేకొత్తపల్లి మండలం దేవరకొండ వద్ద కొత్తగా మరో రెండు జలాశయాలు మంజూరయ్యాయి. ఈ మూడింటికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 9న భూమిపూజ చేశారు. గత ప్రభుత్వంలో అన్నివిధాలా సర్వేలు నిర్వహించి పుట్టకనుమతో చాలా ప్రయోజనం ఉందని నివేదించిన జలవనరులశాఖ, ప్రస్తుతం ప్రభుత్వం మారగానే ఆ ప్రాజెక్టుతో మేలు జరగదని చెప్పడం ఇప్పుడు చర్చనీయంగా మారింది.
75 వేల ఎకరాల ఆయకట్టు నీరిచ్చేలా జలవనరులశాఖ ప్రణాళికలు
పేరూరు కాలువ, హంద్రీనీవా ప్రధాన కాలువ కింద నిర్మిస్తున్న నాలుగు జలాశయాలతోపాటు, పేరూరు ప్రాజెక్టు పరిధిలో 75 వేల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేలా జలవనరులశాఖ ప్రణాళిక చేసింది. సోమరవాండ్లపల్లి జలాశయంలో 1.5 టీఎంసీలు నిల్వచేసి 8,800 ఎకరాలకు ఇవ్వనున్నారు. ముట్టాల ప్రాజెక్టులో 2.024 టీఎంసీలు నిల్వచేసి 18,700 ఎకరాలకు, రెండో దశలోని హంద్రీనీవా ప్రధాన కాలువ కింద దేవరకొండ వద్ద నిర్మించే జలాశయంలో 0.89 టీఎంసీలు నిల్వచేసి, 19,500 ఎకరాలకు, తోపుదుర్తి వద్ద నిర్మించే ప్రాజెక్టులో 0.992 టీఎంసీల నిల్వతో, 18,000 ఎకరాలకు ఇచ్చేలా ప్రణాళిక చేశారు. రామగిరి మండలంలోని పేరూరు రిజర్వాయరులో 1.081 టీఎంసీలు నిల్వచేసి, పదివేల ఎకరాలకు ఆయకట్టు ఇవ్వాలని నిర్ణయించారు. గత ఉత్తర్వుల మేరకు సోమలవాండ్లపల్లి, పుట్టకనుమ, పేరూరు జలాశయాల్లో 3.191 టీఎంసీలు నిల్వచేయటానికి ఆమోదం వచ్చింది. ఇందుకు రూ.803.96 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.200 కోట్లు పుట్టకనుమకు మంజూరు చేశారు. ఈ సొమ్ముతోనే తాజాగా మూడు ప్రాజెక్టులు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
రైతులకు పరిహారం అందేనా...?
గతంలో మంజూరైన పేరూరు కాలువ, రెండు జలాశయాలకు అవసరమైన భూమి సేకరించడమే సమస్యగా మారింది. కాలువ తవ్వడానికే రైతుల నుంచి 1011 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇప్పటి వరకు 750 ఎకరాలే సేకరించారు. ఈ రైతులకు రూ.23 కోట్ల ఇవ్వాలని ఏడాదిన్నర కిందట ప్రభుత్వానికి జాబితా పంపించారు. ఈ భూమిని రెవెన్యూ అధికారులు జలవనరుల శాఖకు అప్పగించలేదు. ప్రభుత్వ భూమి ఉన్నచోట మాత్రం గతంలోనే కాలువ తవ్వారు. తాజాగా నాలుగు జలాశయాలు, కాలువ కోసం 5,403 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. పరిహారం ఇచ్చాకే పనులు చేయండని రైతులు స్పష్టం చేస్తున్నారు. మూడు రోజుల కిందట వెంకటాంపల్లి రైతులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు.
ప్రతిరైతుకు పరిహారం అందుతుంది
"అప్పర్ పెన్నార్ జలాశయానికి నీటిని తరలించే కాలువ నిర్మాణానికి ఇప్పటి వరకు 750 ఎకరాల భూమి సేకరించాం. ఆ రైతులకు పరిహారం కోసం జాబితా ప్రభుత్వానికి పంపించాం. ఎన్నికలకు ముందు జాబితా పంపడంతో, కోడ్ వచ్చి నిధులు రాలేదు. భూమిచ్చిన ప్రతి రైతుకు పరిహారం అందుతుంది."
- రవీందర్, డిప్యూటీ కలెక్టర్, హంద్రీనీవా భూసేకరణ విభాగం
భూమి అప్పగించిన వెంటనే పనులు
పుట్టకనుమ జలాశయం నిర్మాణం ప్రభుత్వం రద్దు చేసింది. దీనికి వెచ్చించే రూ.200 కోట్లతో ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ వద్ద మూడు జలాశయాలు నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టులకు భూసేకరణ చేయాల్సి ఉంది. భూమి తమకు అప్పగించాకనే పనులు మొదలుపెడతాం. వచ్చే ఏడాది జూన్ 30లోపు పనులు పూర్తి కావడం అసాధ్యం. కనీసం రెండేళ్లు సమయం పడుతుంది.
- వెంకటరమణ, ఎస్‌ఈ, హంద్రీనీవా ప్రాజెక్టు
ఇదీ చదవండీ: