అనంతపురం, గుత్తి, ధర్మవరం రైల్వేస్టేషన్లకు ఐఎస్‌ఓ ధ్రువీకరణ పత్రాలు దక్కాయి. ఈ స్టేషన్ల నిర్వహణ, ప్రయాణికులకు అందిస్తున్న సేవలు అంతర్జాతీయ ప్రమాణాలకు సమానంగా ఉన్నాయని హైదరాబాద్‌కు చెందిన ఎల్‌ఎంఎస్ సంస్థ ధ్రువీకరించింది. ప్రధానంగా స్టేషన్లలో పరిశుభ్రత, టికెట్ బుకింగ్ నిర్వహణ, తినుబండారాల నాణ్యత, ప్రయాణికులకు సౌకర్యాల కల్పన తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ఇటీవలే ధ్రువపత్రాలను గుంతకల్లు రైల్వే డివిజన్ డీఆర్‌ఎం అలోక్ తివారి ఆయా స్టేషన్ల అధికారులకు అందజేసి అభినందించారు. ఈ నేపథ్యంలో ఆయా రైల్వే స్టేషన్లలో అధికారులు, సిబ్బంది ప్రయాణికులకు అందిస్తున్న సేవలపై ప్రత్యేక కథనం.
ప్రమాణాలు పాటించడంలో ముందంజ
ప్రమాణాలు పాటించడంలో అనంతపురం రైల్వే స్టేషన్ ముందు వరుసలో నిలుస్తుంది. పరిశుభ్రతలో 2015లో డివిజన్ పరిధిలో రోలింగ్ సీల్డు, స్వచ్ఛ భారత్ సర్వే 2019లో దేశంలోనే 121 ర్యాంకు సాధించింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్టేషన్‌లో పాలిథిన్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. ప్రయాణికుల చేతుల్లో కవర్లు కనిపిస్తే జరిమానా విధిస్తున్నారు. ప్లాట్‌ఫారంపై చెత్త వేయకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికులు సిగరెట్టు, బీడీలు వంటివి తాగకుండా చూస్తున్నారు. కాగితం లేని సేవలు అందించాలనే ఉద్దేశంతో సాధారణ టికెట్ల కోసం ఈ టికెట్టు విధానాన్ని అమలు చేస్తున్నారు.
నీటి వృథాకు అడ్డుకట్ట
నీరు, విద్యుత్తును పొదుపు చేయడంలో సఫలీకృతులయ్యారు. నీరు వృథా కాకుండా పైపులు, కొళాయిలు వద్ద లీకేజీలను అరికట్టారు. విద్యుత్తు పొదుపునకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. వంతెనలపై స్కానర్లతో కూడిన దీపాలు అమర్చారు. ప్రయాణికులు నడుస్తున్నప్పుడు మాత్రమే అవి వెలుగుతాయి. ఎవరూ లేకపోతే వాటంతట అవే ఆరిపోతాయి. దీంతోపాటు ప్లాట్‌ఫారంపై రైలు వచ్చే సమయానికి 5 నిమిషాల ముందు దీపాలు వెలిగిస్తున్నారు. మిగతా సమయంలో తక్కువ దీపాలు వెలిగేలా చర్యలు తీసుకుంటున్నారు.
పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట
గుత్తి రైల్వే జంక్షన్‌లో పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. జంక్షన్‌లో వీఐపీలు, సామాన్య ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేందుకు చక్కటి గదులు ఉన్నాయి. ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు చేపడుతున్నారు. స్టేషన్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం ఉన్న బుకింగ్ కార్యాలయాన్ని తొలగించి అదనపు ప్లాట్‌ఫారాలు ఏర్పాటు చేస్తారు. ప్రయాణికుల కోసం లిఫ్టును ఏర్పాటు చేస్తున్నారు. ఉద్యోగులు, సిబ్బంది సమష్టి కృషితోనే గుత్తి రైల్వే జంక్షన్‌కు ఐఎస్‌వో గుర్తింపు లభించిందని మేనేజర్ కిరణ్ తెలిపారు.
ధర్మవరంలో సేవలు భేష్
ధర్మవరం రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. రైల్వేస్టేషన్‌లో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. స్టేషన్ ఆవరణ, ఫ్లాట్‌ఫారమ్‌పై ఎక్కడా చిత్తు పేపరు కూడా లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. టికెట్ బుకింగ్ కేంద్రం నిర్వహణలోనూ శ్రద్ధ తీసుకుంటున్నారు. వెయిటింగ్ రూమ్‌లో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించారు. రైల్వేస్టేషన్ ఆవరణలో గోడలపై వివిధ కళాచిత్రాలను వేయించడంతో అవి ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. తిరుబండారాల విషయంలోనూ నాణ్యత పాటించే విధంగా పర్యవేక్షిస్తున్నారు. స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు కొవిడ్ నిబంధనలు పాటించేలా చూస్తున్నారు. పర్యావరణం పెంపొందడానికి స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. అన్నిశాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్లే ఐఎస్‌ఓ గుర్తింపు లభించిందని స్టేషన్ మేనేజర్ ఠావూనాయక్ తెలిపారు.
ఇదీ చదవండి: