అనంతపురం జిల్లా కుమ్మరవాండ్లపల్లి సమీపంలోని విఠల్‌రాయుని చెరువులో మట్టిపెళ్లలు విరిగిపడిన ప్రమాదంలో హనుమంతు (35) మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన అతని భార్య నారాయణమ్మ చికిత్స పొందుతోంది. ఇంటి ముందు స్థలం చదునుకోసం మట్టిని తవ్వుకునేందుకు విఠల్‌రాయుని చెరువులోకి వెళ్లిన కుమ్మరవాండ్లపల్లికి చెందిన దంపతుల్లో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షులు, కుటుంబసభ్యుల కథనం మేరకు.. హనుమంతు, నారాయణమ్మ సోమవారం మధ్యాహ్నం చెరువులో మట్టి తవ్వుకునేందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మట్టిపెళ్లలు విరిగి దంపతులపై పడ్డాయి. హనుమంతు వాటి కింద కూరుకుపోయాడు. భార్య తీవ్రంగా గాయపడింది. ఆమె కేకలు విన్న స్థానికులు వచ్చి మట్టిని తొలగించి అతన్ని బయటకు తీశారు. అప్పటికే అతను మృతిచెందాడు. ఆమెను కదిరి ఆస్పత్రికి తరలించారు. వీరి కుమార్తె, ఇద్దరు కుమారులు కడప జిల్లాలోనే చదువుతున్నారు. కళ్లెదుటే భర్త మట్టిలో కూరుకుపోయిన ఘటనను చూసి, పిల్లలు నాన్నేడి అంటే ఏం చెప్పాలంటూ రోదించడం అక్కడ ఉన్నవారిని కలిచివేసింది. కదిరి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఇదీ చదవండి : ఏపీ నుంచి ఆదాయ పన్ను రూ.13,446 కోట్లు