ETV Bharat / state

కరోనాకు దూరంగా ..ఆరోగ్యానికి దగ్గరగా ..! - Anantapur district news

ఆ గ్రామాల ప్రజలు రాబోయే ఉపద్రవాన్ని ముందే గుర్తించి...అప్రమత్తమయ్యారు. నిబంధనలు పాటిస్తూ...కరోనా వైరస్ కట్టడికి జాగ్రత్తలు తీసుకున్నారు. దీనికి తోడు గ్రామపెద్దలు, స్థానిక నాయకులు ఎప్పటికప్పుడు ప్రజల్లో అవగాహన కల్పించారు. ఫలితంగానే ఆ గ్రామాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

No corona cases
No corona cases
author img

By

Published : May 10, 2021, 10:56 AM IST

ఆ గ్రామాల ప్రజలు కరోనాను తేలిగ్గా తీసుకోలేదు.. ఉపద్రవాన్ని ముందే గుర్తించి బాధ్యతతో మెలిగారు.. నిబంధనలు పాటిస్తూ వైరస్‌ కట్టడికి జాగ్రత్తలు తీసుకున్నారు.. ప్రతి చిన్న అవసరానికి పట్టణాలపై ఆధారపడకుండా పల్లెల్లోనే సమకూర్చుకుంటున్నారు. కూరగాయలు, ఆకుకూరలు, పాలు వంటివి తామే ఉత్పత్తి చేసుకోవడం ముందునుంచీ అలవాటు చేసుకున్నారు. దీనికితోడు స్థానిక నాయకులు, ఊరి పెద్దలు గ్రామస్థులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ కరోనా కట్టడికి చైతన్యం తెచ్చారు. ఫలితంగానే అనంతపురం జిల్లాలోని ఆ గ్రామాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

సహజ జీవన విధానం

కళ్యాణదుర్గం రూరల్​లోని కడదరకుంట గ్రామంలో 70 కుటుంబాలు, 250 మంది జనాభా నివసిస్తున్నారు. గ్రామస్థులంతా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. గ్రామంలో పండిన కూరగాయలనే ఆహారంగా తీసుకుంటున్నారు. మాంసాహారానికి సంబంధించి ఇంట్లోనే వండుకుని తింటారు. బయటి ఆహారాన్ని ప్రోత్సహించరు. బయటకు వెళ్తే స్వీయ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటిస్తారు. రాత్రి ఎనిమిది దాటితే వీధుల్లో ఎవరూ కనిపించరు. సాయంత్రం 6 గంటల వరకు పొలం పనుల్లో నిమగ్నమై ఉంటారు. రాత్రి 7:30 గంటలకే భోజనం ముగించుకుంటారు. అన్ని రకాల కూరల్లో పసుపు ఎక్కువగా వాడటం వల్ల తమ రోగనిరోధకశక్తి పెరిగిందని గ్రామస్థులు చెబుతున్నారు.

ఆహార అలవాట్లతోనే..

బొమ్మనహాళ్ మండలంలోని కృష్ణాపురం గ్రామంలో 400 కుటుంబాలు నివాసముంటున్నాయి. దాదాపు 2,000 మంది జనాభా జీవిస్తున్నారు. ఇప్పటివరకు కరోనా కేసు నమోదు కాలేదు. గ్రామస్థులంతా వ్యవసాయం, కూలీ పనులపై ఆధారపడుతున్నారు. వరి, జొన్న ఎక్కువగా పండిస్తారు. జొన్నరొట్టెలు వీరి ఆహారంలో ఓ భాగంగా మారిపోయింది. రాగి ముద్దను ఎక్కువగా తీసుకుంటారు. ఉదయాన్నే రాగి జావ తాగుతారు. నూనెవంటలు తక్కువగా వాడతారు. బయట హోటళ్లలో భోజనం, అల్పాహారాలు వంటివి తినడానికి ఇష్టపడరు. ఉదయాన్నే జొన్నరొట్టెలు తింటారు. ప్రతి ఇంటికి ఒక గేదె ఉండటం వల్ల పాలు, పెరుగు ఎక్కువగా తీసుకుంటారు. తమ ఆహార అలవాట్లే కరోనా నుంచి రక్షిస్తున్నాయని గ్రామస్థులు తెలిపారు.

అత్యవసరమైతేనే బయటకు..

తనకల్లు మండలంలోని తురకవాండ్లపల్లి ఓ మారుమూల గ్రామం. తుమ్మల అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉంది. ఇక్కడ మొత్తం 70 నివాస గృహాలు ఉండగా.. 300 మంది నివసిస్తున్నారు. ఇప్పటివరకు గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. గ్రామస్థులంతా శ్రమను నమ్ముకుని జీవిస్తున్నారు. అందరికీ వ్యవసాయం, ఉపాధి హామీ పనులే జీవనాధారం. చాలామంది కూరగాయలు సొంతంగా పండించుకుంటున్నారు. ఇంటి భోజనం తప్ప బయట ఆహారాన్ని తీసుకోరు. బయట గ్రామాలకు, పట్టణాలకు వెళ్లడం అరుదు. ఏదైనా అత్యవసరమైతే ద్విచక్రవాహనంపై నేరుగా వెళ్లి వీలైనంత త్వరగా ఇంటికి చేరుకుంటారు. ఏడాది పొడవునా ఏదో ఓ పనిలో నిమగ్నమై ఉంటారు. జన సమూహాలకు దూరంగా ఉంటారు. అందుకే తమ గ్రామంలోకి కరోనా వైరస్‌ ప్రవేశించకుండా అడ్డుకున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు.

వైద్యుల సలహాలు పాటిస్తూ..

గాండ్లపెంట మండలంలోని ఎనుములవారిపల్లిలో 56 నివాసాలు ఉన్నాయి. దాదాపు 200 మంది జనాభా. అంతా రైతులు, ఉపాధి కూలీలే. మొదట్నుంచీ కరోనాపై జాగ్రత్తగా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటూ వాటిని ఆచరిస్తున్నారు. నిత్యం పొలం పనుల్లో నిమగ్నం కావడం వల్ల శరీరానికి తగినంత వ్యాయామం దొరుకుతుంది. దీంతో సహజంగానే ఆరోగ్యంగా ఉంటారు. అవసరం ఉంటే తప్ప ఊరి వదిలి బయటకు వెళ్లరు. వీరి ఆహారపు అలవాట్లు వ్యాధుల బారిన పడకుండా దోహదపడుతున్నాయి. కాలాల వారీగా దొరికే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవడం వల్ల రోగనిరోధన శక్తిని పెంచుకుంటున్నారు. తమ ఊరి మీదుగా రవాణా మార్గం లేకపోవడం కూడా ఒక రకంగా మేలు చేసిందని గ్రామస్థులు చెబుతున్నారు.

జాగ్రత్తలు తీసుకుంటున్నాం

మా గ్రామంలో అందరూ శ్రమజీవులే. బయట తిరిగే వాళ్లు తక్కువ. తెల్లారితే పొలం వెళ్లి పనులు చేసుకుని ఇళ్లు చేరుకోవటమే నిత్యకృత్యం. మా ఊరి మీదుగా ప్రయాణ మార్గం లేదు. అనవసరంగా బయటి వాళ్లెవరూ వచ్చే అవకాశం లేదు. ఆరోగ్య సిబ్బంది సూచనలు విధిగా పాటిస్తున్నాం. ముందు జాగ్రత్తలతోనే కరోనాకు దూరంగా ఉన్నాం. - ఇస్మాయిల్‌, ఎనుములవారిపల్లి, కదిరి మండలం

నిర్లక్ష్యం చేయలేదు

జన సమూహాలకు, రవాణా మార్గానికి మేం దూరం. మండలంలో అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్నాం. కరోనా వ్యాప్తి మొదలు నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వలస వెళ్లినవారు ఆరోగ్యంగా ఉంటేనే గ్రామానికి వచ్చేలా చూస్తున్నాం. ఏదైనా అవసరముంటే ద్విచక్ర వాహనంపై వెళ్లి త్వరగా ఇంటికి చేరుకుంటున్నాం. వీలైనంత వరకు సమూహానికి దూరంగా ఉంటున్నాం. - మునికుమార్‌, తురకవాండ్లపల్లి

ఇదీ చదవండి:

ఇష్టానుసారం సీటీ స్కాన్‌ వద్దు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.