Chandrababu in Kalyanadurgam : సమాజంలో పెను మార్పులకు టీడీపీ నాంది పలికిందని, జగన్ పాలనలో ఒక్క రైతు కూడా ఆనందంగా లేడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ హయాంలో పెట్టుబడి రాయితీతో పాటు పంట బీమా తీసుకొచ్చామని, రెండూ ఇచ్చిన ఘనత తెలుగుదేశం (Tlugudesam) పార్టీది అని చంద్రబాబు పేర్కొన్నారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా 'వ్యవసాయ సంక్షోభం'పై ప్రజావేదిక కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. మహిళల కోసం గతంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని, మళ్లీ అధికారంలోకి వస్తే.. మహిళల్లో చైతన్యం కోసం మహాశక్తి పథకం అమలు చేస్తామని తెలిపారు.
అనంతపురం అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే కరువు జిల్లా ( Drought district ) అని చెప్పిన చంద్రబాబు.. హంద్రీనీవాపై రూ.4,200 కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. ఒక పక్క నీళ్లు తేవాలని.. వచ్చిన నీటిని సద్వినియోగం చేయాలనుకున్నామని చెప్పారు. రాయలసీమ( Rayalaseem )ను ఉద్యాన హబ్‌గా తయారుచేయాలని నిర్ణయించామని వెల్లడించారు. ఈ ఏడాది వేరుశెనగ పంట కూడా రాని పరిస్థితి ఉందని చెప్తూ.. గతంలో పంట రాకపోతే పెట్టుబడి రాయితీ ఇచ్చి ఆదుకున్నామని అన్నారు. పెట్టుబడి రాయితీతో పాటు పంట బీమా తీసుకొచ్చామని, పెట్టుబడి రాయితీ, పంట బీమా (Crop insurance) రెండూ ఇచ్చిన ఘనత తెలుగుదేశానిదని గుర్తు చేశారు. జగన్ పాలనలో రాష్ట్రంలో ఒక్క రైతు కూడా ఆనందంగా లేడనేది వాస్తవం అని పేర్కొన్నారు.
సాగునీటి రంగం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మనకు జీవనదులున్నాయి. గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి. కృష్ణా నదిలో నీటి కొరత ఉండడంతో ఆల్మట్టి ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండని పరిస్థితి కనిపిస్తోంది. పెన్నా నది ఎండిపోయింది. వంశధారలో నీళ్లున్నాయి. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం.. దాదాపు 69వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ టీడీపీ. నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో 12వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. సాగునీరిస్తే ఆ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుందనడానికి హంద్రీనీవా చక్కని ఉదాహరణ. జీడీ పల్లిని పూర్తి చేశాం.. కాల్వలు పూర్తి చేశాం. చెర్లోపల్లిని పూర్తి చేశాం. గొల్లపల్లిని పూర్తి చేసి.. కియా మోటార్స్‌ను పూర్తి చేసి ఉపాధి అవకాశాలు ( Employment opportunities ) కల్పించాం. భైరవాని తిప్ప ప్రాజెక్టు కోసం నీళ్లు తీసుకుపోవాలని ఆలోచించాం. తద్వారా కల్యాణదుర్గంలో 114 చెరువులు నింపడానికి కుందుర్తి ద్వారా ఇరిగేషన్ ఛానల్ పెట్టాలని ప్రణాళికలు రూపొందించాం. 26శాతం పనులు పూర్తయినా ఈ ప్రభుత్వం గాలికొదిలింది. ఆ ప్రాజెక్టు పూర్తయి ఉంటే కల్యాణ దుర్గం పచ్చదనంతో కళకళలాడేది.