అనంతపురం జిల్లా ఉరవకొండలో ప్రసిద్ధిగాంచిన గవిమఠం బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ సాయంత్రం బ్రహ్మరథోత్సవం జరగనుండగా... మన రాష్ట్రంతో పాటు కర్ణాటక నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో మఠానికి పోటెత్తుతున్నారు.
శతాబ్దాల చరిత్ర..
గవిమఠం సంస్థానానికి శతాబ్దాల చరిత్ర ఉంది. సహజంగా వెలిసిన చంద్రమౌళీశ్వరుడు గవిలో పూజలు అందుకుంటుండటంతో ఇది గవిమఠంగా పేరొందింది. ఈ మఠం 770 ఉపమఠాలకు ప్రధాన వేదిక. శైవమతం కోసం కరిబసవ రాజేంద్రస్వామి గవిమఠాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం మఠానికి ఎనిమిదో పీఠాధిపతిగా చెన్నబసవ రాజేంద్రస్వామి కొనసాగుతున్నారు. ఉత్తరాధికారిగా డాక్టర్ రాజేంద్రస్వామి వ్యవహరిస్తున్నారు. మఠం కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పరిమితమవకుండా సామాజిక సేవలోనూ ముందుంది.
ఏర్పాట్లు పూర్తి..
మఠం పీఠాధిపతి ఆదేశాలతో ఆలయ సహాయ కమిషనర్ చిట్టెమ్మ ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. బ్రహ్మరథోత్సవ కార్యక్రమానికి ఏపీ, కర్ణాటక నుంచి భారీగా భక్తులు వస్తుండడంతో ప్రత్యేక పోలీసు బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఉరవకొండ సీఐ శేఖర్ తెలిపారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిఘా ఉంచామని వెల్లడించారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ రథోత్సవం ప్రశాంతంగా పూర్తి చేస్తామని సీఐ తెలిపారు.
ఇదీ చదవండి
Kolikapudi Padayatra: అమరావతి నుంచి తిరుమలకు.. కొలికపూడి పాదయాత్ర..!