అనంతపురంలో రెవెన్యూ అధికారులు.. ఇళ్ల కూల్చివేత చేపట్టడం.. ఉద్రిక్తతకు దారితీసింది. దాదాపు గంట పాటు పోలీసులకు, స్థానికులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పట్టణ శివారు కాలనీ విద్యారణ్యనగర్ సమీపంలో ఓ వ్యక్తికి సంబంధించిన 32 సెంట్ల స్థలంలో కొంతమంది అక్రమంగా నివాసముంటున్నారనే కోర్టు ఉత్తర్వుల మేరకు.. తొలగింపు చర్యలు చేపట్టామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. 30 ఏళ్లుగా నివాసముంటున్నామని కూలిపని చేస్తూ బతుకులు కొనసాగించే తమకు ఉన్న ఫళంగా వచ్చి ఇళ్లు కూలుస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాల్సిన అధికారులు.. పేద ప్రజల బ్రతుకులను రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇళ్లు కూలుస్తున్న సమయంలో జేసీబీ వాహనానికి బాధితులు అడ్డుగా వెళ్లారు. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి అడ్డుకున్న ప్రజలను అదుపు చేశారు. ఇళ్లు ఖాళీ చేయడానికి సమయం అడిగినా.. అధికారులు ఇవ్వలేదని బాధితులు వాపోయారు. 30 నుంచి 40 ఏళ్లుగా నివాసముంటున్న తమకు పరిహారం కూడా ఇవ్వకుండా వెళ్ళమంటే ఎలా అని కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. మరోవైపు.. 32 సెంట్ల స్థలంలో దాదాపు 16 ఇళ్లను కూల్చివేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:
CM Jagan: 'సెప్టెంబరు 22న కోర్టుకు రండి' : ఈడీ కేసుల్లో జగన్‌కు సీబీఐ కోర్టు సమన్లు