వెంకట రత్నమ్మ (78) అనే వృద్ధురాలికి సొంతవారు ఎవరూలేరు... పదేళ్ల క్రితం అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని లక్ష్మీ చెన్నకేశవ పురం కాలనీకి చెందిన ఓ కుటుంబం చేరదీసింది. తనకంటూ నలుగురున్నారని మురిసిపోయిన ఆ ముసలి ప్రాణం యాచించి.. వచ్చిన సొమ్మంతా వారికే ఇచ్చేది. నెలనెలా వచ్చే పెన్షన్స్ సొమ్ము వృద్ధురాలి చేతికి వచ్చిన నిమిషాల వ్యవధిలోనే వాళ్లు తీసుకున్నా కడదాకా సాగనంపుతారని ఆశపడింది. కానీ ఆ కుటుంబ సభ్యులకు కనీసం కనికరం కూడా లేకుండా ప్రవర్తించారు. జ్వరం బారిన పడిన రత్నమ్మను వైద్యులకు చూపించాల్సింది పోయి రోడ్డుపైకి గెంటేశారు.
నాలుగు రోజులుగా లక్ష్మీ చెన్నకేశవాపురం ప్రధాన రహదారి పక్కన ఉన్న చెట్టుకింద వెంకట రత్నమ్మ ఎండకు ఎండుతూ, వర్షంలో తడుస్తూ మరింత అనారోగ్యానికి గురైంది. అవస్థలు పడుతూ అక్కడే ఊపిరి వదిలింది. ఆమె మృతదేహాన్ని శ్మశానానికి తీసుకువెళ్లే వారే కరువయ్యారు. రహదారి పక్కన చెట్టు కింద వృద్ధురాలి మృతదేహం అలాగే ఉండటంతో స్థానికులు ధర్మవరం ఆర్డీవో మధుసూదన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి.. పోలీసులకు, మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. వృద్ధురాలి మృతదేహాన్ని మున్సిపాలిటీ వారు తీసుకువెళ్లి ఖననం చేశారు.
పదేళ్లుగా వృద్ధురాలు సొమ్ము తీసుకున్న కుటుంబం కనీసం కడసారి చూసేందుకు కూడా రాకపోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సాయం కాదు కదా కనీసం సాగనంపడానికి కూడా రాకపోవడంపై కలత చెందారు.
ఇవీ చదవండి: పుట్టపర్తి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు నాయిబ్రాహ్మణుల ర్యాలీ