అనంతపురం జిల్లాలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యేవి. మరణాలు కూడా అదే స్థాయిలో సంభవించేవి. జిల్లాలోనే ఆక్సిజన్ పడకలు, వెంటిలేటర్లకు కొరత తలెత్తడంతో..అధికార యంత్రాంగం దీనిపై దృష్టి సారించింది. నగరంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సమీపంలో 300 పడకల సామర్థ్యంతో జర్మన్ హ్యాంగర్ తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. ప్రతి పడకపై చికిత్స పొందే రోగికి ఆక్సిజన్ అందించేలా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వంద పడకలకు అక్సిజన్ అందిస్తున్నారు. మిగిలిన 200 పడకలకు ఆక్సిజన్ అందించే పైపులైను పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మరో 70 పడకలకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఏర్పాటు చేశారు.
అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆక్సిజన్, వెంటిలేటర్ ఉన్న పడకలు 580 వరకూ ఉన్నాయి. ఆక్సిజన్ పడకల అవసరం పెరుగుతున్న దృష్ట్యా... జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో తాత్కాలిక ఆసుపత్రులు నిర్మాణం చేస్తున్నారు. తాడిపత్రిలో నాలుగు రోజుల్లో 500 పడకల ఆసుపత్రి అందుబాటులోకి రానున్నట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు.మూడో దశ కరోనా వైరస్ వ్యాప్తి ఉంటుందనే నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో 800 ఆక్సిజన్ పడకలు అందుబాటులోకి రావటంపై హర్షం వ్యక్తమవుతోంది.
ఇదీ చదవండి: