Free Fire Game: అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలానికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి అదే పనిగా సెల్ఫోన్లో ఫ్రీ ఫైర్ ఆట ఆడుతున్నాడు. ఇలా దాదాపు మూడు నెలల నుంచి అదేపనిగా ఆడుతున్నాడు. ఎంతలా అంటే.. ఎవరు పిలుస్తున్నా కనీసం పట్టించుకోకుండా ఆటలోనే మునిగిపోయేలా తయారయ్యాడు. ఈ క్రమంలో.. రెండు రోజుల క్రితం ఇంటి వద్ద సృహతప్పి పడిపోయాడు. తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి కర్నూలుకు తీసుకెళ్లాలని సూచించారు.
ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆ విద్యార్థి తల్లిదండ్రులను కూడా గుర్తుపట్టలేకపోతున్నాడు. కుమారుడి పరిస్థితి చూసి ఆ దంపతులు బోరున విలపిస్తున్నారు. ఫోన్లో గేమ్ కు బానిసై, నరాలు చిట్లి అపస్మారక స్థితిలోకి వెళ్లాడని, కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు చెప్పారని బంధువులు తెలిపారు.
"మా కుమారుడు ఎప్పుడు చూసినా పబ్బీ (ఫ్రీఫైర్) గేమ్ ఆడుతాడు. రాత్రి 12గంటల నుంచి తెల్లవారు జాము వరకు ఆడుతుంటాడు. అయితే.. వారం క్రితం తలనొప్పివస్తోందని చెప్పాడు. దాంతో ఆసుపత్రికి తీసుకెళ్లాము. మళ్లీ ఇవాళ తిరుపతిలోని ఆసుపత్రికి తీసుకొచ్చాం. ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నాడు. తింటున్నాడు. కానీ ఇంకా మమల్ని గుర్తుపట్టట్లేదు."
- విద్యార్థి తండ్రి
"రాత్రి 12గంటల నుంచి తెల్లవారు జామువరకు ఆడుతుంటాడు. మా ఇద్దరు కుమారులు సెల్ఫోన్ విషయమై గొడవ పడుతుంటారు. మూడునెలల నుంచి మా కుమారుడు సెల్లో పబ్జీ (ఫ్రీ ఫైర్)గేమ్ ఆడుతున్నాడు. తలనొప్పిగా ఉందంటే ఆసుపత్రికి తీసుకొచ్చాం. ఇప్పుడు మా కుమారుడు మమల్ని గుర్తుపట్టట్లేదు."
- విద్యార్థి తల్లి
ఇదీ చూడండి: పబ్జీ ఆడుతూ గుండెపోటుతో బాలుడు మృతి