సీఎం జగన్‘‘క్విడ్ ప్రొ కో-2’’ కు తెరలేపారని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. 2004-09మధ్య ‘‘క్విడ్ ప్రొ కో -1 జరిగితే, ఇప్పుడు ‘‘క్విడ్ ప్రొ కో- 2ను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. హెటిరో ముసుగులో విశాఖ బేపార్క్, బినామీల పేర్లతో 300కోట్ల రూపాయల విలువైన రుషికొండ భూములు జగన్ హస్తగతమయ్యాయన్నారు. పర్యటక ప్రాజెక్టులు తెదేపా అభివృద్ది చేస్తే, బినామీ వ్యాపారాల అభివృద్ధిలో సీఎం జగన్ ఉన్నారని యనమల విమర్శించారు.
సీబీఐ కేసుల్లో ఉన్న తన సహనిందితులకే జగన్ పాలనలో మేలుజరుగుతోందని ఆరోపించారు. జగన్పై సీబీఐ తొలి ఛార్జి షీట్లో ఏ3గా అరబిందో, ఏ4గా హెటిరో ఉన్నాయని గుర్తు చేశారు. హెటిరో అనుబంధ సంస్థలన్నింటిపైనా ఈడీ కేసులున్నాయని వెల్లడించారు. ‘‘ఏ3 అరబిందో కంపెనీ’కే కాకినాడ సెజ్ కట్టబెట్టిన సీఎం జగన్.. ఇప్పుడు ‘‘ఏ4 హెటిరోకు’’ విశాఖ బేపార్క్ కట్టబెడుతున్నారని ఆరోపించారు.
జగన్మోహన్ రెడ్డి బినామీ లావాదేవీలపై కేంద్రం అత్యున్నత స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. కాకినాడ సెజ్, విశాఖ బేపార్క్ లావాదేవీలపై కేంద్రానికి ఫిర్యాదు చేసి జగన్మోహన్ రెడ్డి ‘‘క్విడ్ ప్రో కో-2’’ గుట్టు రట్టు చేస్తామని యనమల స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: రాయలసీమ, ప్రకాశం, నెల్లూరుకి శ్రీశైలం ప్రాజెక్టే ఆధారం: జగన్