మాజీ మేయర్, తెలుగుదేశం నాయకుడు సబ్బం హరి ఇంటి కూల్చివేత సంఘటనపై విశాఖ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, తెల్లవారుజామున పెద్ద ఎత్తున పోలీసు సిబ్బందితో 5 అడుగులలో ఉన్న మరుగుదొడ్డి కూల్చివేసేందుకు మహా విశాఖ నగర పాలక సంస్థ సిబ్బంది హడావిడి సృష్టించారని ఆరోపించారు.
రాష్ట్రంలో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదని.... జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకులను భయబ్రాంతులకు గురి చేసేందుకు వైకాపా ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని రామకృష్ణబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
ఘటనపై నేతల ఆరా..
సబ్బంహరి ఇంటి ఆవరణలో జరిగిన సంఘటనను తెలుసుకున్న తెలుగుదేశం నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు అతని ఇంటికి చేరుకున్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయ అధ్యక్షుడు భరత్ సబ్బం హరితో ఘటనపై చర్చించారు. మాజీ శాసనసభ్యుడు, భాజపా నాయకుడు విష్ణుకుమార్ రాజు ఘటనా స్థలానికి చేరుకొని సబ్బం హరి నుంచి వివరాలను తెలుసుకున్నారు.
ఇదీ చదవండి: సబ్బంహరి ఇంటిని కూల్చడంపై అంత సైకోయిజం ఏంటి: చంద్రబాబు