విశాఖ మహా నగర పరిధిలో ద్విచక్ర వాహనాల వికేత్రలకు పండగల సీజన్లో అమ్మకాల జోరుపెంచాయి. కొవిడ్ లాక్డౌన్ తర్వాత అమ్మకాలు జోరుగా సాగడం, వీటికి దసరా, దీపావళి ఆఫర్లు, ఏడాది ముగింపు అఫర్లు కొనసాగింపుగా రానుండడం వల్ల విక్రయాలు పెరిగాయి. కొవిడ్ దృష్ట్యా ప్రజలు వ్యక్తిగత వాహన ప్రయాణానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో వాహనాలు కొనుగోలు పెరిగాయని విక్రయదారులు తెలిపారు. విశాఖ నగరంలోనే దసరా సమయంలో దాదాపు రూ.50 కోట్లకు పైగానే ద్విచక్రవాహనాల అమ్మకాలు సాగాయన్నది ఒక అంచనా. ఇప్పుడు దీపావళి అఫర్లతో మరింతగా పుంజుకునే దిశలోనే ఉందని డీలర్లు చెబుతున్నారు.
సొంత ప్రాంతానికి దూరంగా ఉద్యోగాలు నిర్వహిస్తున్న వారు కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోం ఆప్షన్ వినియోగించుకుని విశాఖ చేరుకోవడం వల్ల నగరంలో కార్ల సంఖ్య, ట్రాఫిక్ కూడా గణనీయంగా పెరిగింది. ప్రధానంగా బెంగళూరు, హైదరాబాద్, నోయిడా, పూణె, చెన్నైలలో సాప్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న వారు...విశాఖకు తిరిగి వచ్చారు. పాత వాహనాలను మార్చేందుకు, కొత్త కార్లను కొనుగోలుకు పండగ ఆఫర్లు ఆకర్షిస్తున్నాయి.
కరోనా కారణంగా ఆన్లైన్ తరగతులతో కొత్త ఫోన్లు, టాబ్లు, లాప్టాప్లను కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి. ఈ-కామర్స్ అమ్మకాలతో పోటీ పడుతూ సంప్రదాయ దుకాణాలు తమ అవసరాన్ని నిలుపుకునేలా ఆఫర్లు ఇస్తున్నాయి. దాదాపుగా ఆన్ లైన్ ధరలతో సమానంగా ఈ ఉపకరణాలను అందించడం, సర్వీసు ఇవ్వడం వంటివి ఈ దుకాణాల అవసరాన్ని చాటి చెబుతున్నాయన్నది వీరి అంచనా.
బంగారు అభరాణాల అమ్మకాలు కూడా కొత్త అఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ధన త్రయోదశి, దీపావళి ముందు కొనుగోళ్లను పెంచుకునేందుకు వివిధ సంస్థలు సిద్ధమయ్యాయి.
కరోనా వల్ల కొన్ని రంగాల్లో ఉద్యోగాల తీసివేత, కొత్తగా కల్పన లేకపోయినప్పటికీ , రిటైల్ రంగంలో మాత్రం అమ్మకాల జోరు కొనసాగుతోంది. కొనుగోళ్లు ఇక్కడ ఉద్యోగాలకు ఢోకా లేకుండా చేసింది. పూర్తి లాక్డౌన్ సమయంలో దుకాణాలు తెరవక కొంత ఇబ్బందులు ఉన్నా తెరిచిన తర్వాత మాత్రం వీటి జోరుకి బ్రేక్ పడకపోవడం మార్కెట్ వర్గాల జోష్‌కి కారణమవుతోంది.
ఇదీ చదవండి