విశాఖ నగరం వెంకోజిపాలెంలోని జ్ఞానానంద రామానంద ఆశ్రమ సాధుమఠం స్వాధీనానికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఇందుకోసం కొందరు తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆశ్రమ పీఠాధిపతి పూర్ణానంద సరస్వతి స్వామీజీ ఆందోళనకర వ్యాఖ్యలతో భక్తులు కలవరపాటుకు గురవుతున్నారు. స్వామీజీ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘గతంలో గుర్తు తెలియని వ్యక్తులు భయాందోళనకు గురి చేశారు. ఇప్పుడు నేరుగా వచ్చి భయపెడుతున్నారు. నాకు ప్రాణహాని ఉంది. నా మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. సుమారు గంటన్నర పాటు ఇక్కడే ఉండి తలుపులు మూసి మరీ మాట్లాడారు. ఇదంతా దేవాదాయశాఖలో కొందరు కావాలని చేస్తున్నారు. మఠానికి ట్రస్టు బోర్డు ఏర్పాటుకు ఇటీవల ప్రకటన ఇచ్చారు. దానిపై నేను హైకోర్టుకు వెళ్లి మధ్యంతర ఉత్తర్వు తెచ్చుకుంటే...ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి.. ఎంఆర్‌వో జ్ఞానవేణిని పిలిచి సర్వే చేయించమని చెప్పారు. ఆ తరువాత నా అభిప్రాయం అడిగిన సమయంలో పీఠాలకు ఆలయాలు ఉన్నాయి. వాటన్నింటినీ దేవాదాయశాఖ తీసుకుందా? చినముషిడివాడ శారదాపీఠంలో ఉన్న వాటిని తీసుకున్నారా? మా మఠాన్ని ఎందుకు తీసుకుంటున్నారని అడిగా. ఎప్పుడో ఈ స్థలాన్ని దేవాదాయశాఖ తీసుకుంది కదాని ఎంపీ అడిగారు. అయితే మఠానికి ఇచ్చినట్లు ప్రభుత్వం గతంలో జీవో ఇచ్చింది. దానిని అమలు చేయమని హైకోర్టుకు వెళ్లాను. అమలు చేయమని చెప్పింది. కోర్టు ఆదేశాలు పట్టించుకోలేదు. దీనిపై కోర్టు ధిక్కరణ కేసు వేశాం. ప్రస్తుతం అదీ పెండింగులో ఉంది. ఈ పరిస్థితుల్లో ట్రస్టు బోర్డు ఏర్పాటుకు ప్రకటన ఎలా ఇస్తారు. ట్రస్టు బోర్డును అడ్డం పెట్టుకొని మఠం ముందున్న ఖాళీ స్థలాన్ని నచ్చినోళ్లకు ఇచ్చుకుంటారు. కోర్టులోని కేసును ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు..’ అని పూర్ణానంద సరస్వతి స్వామీజీ పేర్కొన్నారు.
నాయకులు ఆశ్రమానికి వెళ్లడంతో
వెంకోజీపాలెంలోని దాదాపు తొమ్మిది ఎకరాల్లోని జ్ఞానానంద ఆశ్రమానికి సోమవారం సాయంత్రం ఎంపీ విజయసాయిరెడ్డి, వీఎంఆర్‌డీఏ ఛైర్‌పర్సన్ విజయనిర్మల, ఉత్తర నియోజకవర్గ ఇన్‌ఛార్జి కేకే రాజు, వైకాపా నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, దేవాదాయశాఖ సహాయ కమిషనర్ శాంతి, తహసీల్దార్ జ్ఞానవేణి ఇతర అధికారులు సందర్శించారు. స్వామీజీ ఆహ్వానం మేరకు విజయసాయిరెడ్డి అక్కడికి వెళ్లగా సమస్యలపై ఆరా తీసినట్లు సమాచారం. ఈ సమయంలో ఆశ్రమంలోని విద్యార్థులకు అమ్మఒడి వర్తింపజేయలేదని చెప్పడంతో వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి ఆయన తీసుకువెళ్లారు. అలాగే ఇతర సమస్యలు, భూమి ఆక్రమణలో ఉందని వివరించగా... ఎంత భూమి ఉందో హద్దులు గుర్తించాలని రెవెన్యూ, దేవాదాయశాఖ అధికారులకు సంయుక్త సర్వే నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిసింది. ఒక్కసారిగా నేతలందరూ ఆశ్రమాన్ని సందర్శించడంపైనా ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది.
- తాజా పరిణామాలపై దేవాదాయశాఖ ఏసీ శాంతి స్పందిస్తూ.. ఎంపీ విజయసాయిరెడ్డి ఆశ్రమాన్ని సందర్శించడంతో అక్కడికి వెళ్లాం. గతంలో ట్రస్టు బోర్డు ప్రకటన ఇచ్చాం. కోర్టు ఉత్తర్వులు ఉండడంతో దానిపై ముందుకు వెళ్లలేదు. ఎవరూ ఎటువంటి బెదిరింపులకు దిగలేదన్నారు. వైకాపా నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ స్పందిస్తూ... ‘స్వామీజీ ఆహ్వానం మేరకు ఆశ్రమాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి సందర్శించారు. భూమి ఆక్రమణలో ఉందని చెబితే సర్వే చేసి ఎవరికి ఎంత భూమి వస్తుందో హద్దులు వేసి అప్పగించాలని అధికారులను ఆదేశించారు. అంతే తప్ప ఎవరూ బెదిరింపులకు పాల్పడలేదు’ అని పేర్కొన్నారు.
Commercial Gas: పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర...చిరు వ్యాపారుల గుండెల్లో గుబులు