కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం వైకాపాలో వర్గపోరు తారాస్థాయికి చేరుతోంది. వచ్చే ఎన్నికల్లో వైకాపా టికెట్ తప్పకుండా తనకే వస్తుందన్న యార్లగడ్డ వెంకట్రావుకు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కౌంటర్ ఇచ్చారు. తనకు సీఎం జగన్ మద్దతు ఉందన్న వంశీ.. అప్పుడప్పుడు వచ్చేపోయే వారి గురించి తాను పట్టించుకోనన్నారు. ఎవరికి సీటు ఇవ్వాలో జగన్ నిర్ణయిస్తారన్నారు. మట్టి తవ్వకాలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
"జగన్ పని చేయమన్నారు.. చేస్తున్నా. మిగతా వారి గురించి పార్టీ చూసుకుంటుంది. నా మీద ఏమైనా బాధ ఉంటే వారు జగన్ దగ్గర చెప్పుకుంటారు. పిచ్చి కామెంట్లు అన్నీ అనవసరం. నేను గెలిచినా ఓడిపోయినా గన్నవరంలో ఉన్నా. నేను 15 సినిమాలు తీశాను. మా సినిమాల్లో వాళ్ల లాంటి క్యారెక్టర్లు చాలా మంది ఉన్నారు. ఊరు, దేశం వదిలిపోయే వాళ్లు.. ఊరికే వచ్చి పారిపోయేవాళ్లను చాలా మందిని చూశాం. తాను హీరోనో, విలన్నో గన్నవరం నియోజకవర్గ ప్రజలను అడిగితే చెబుతారు. బొగ్గు మట్టికి, బాక్సైట్ మట్టికి, బంగారం మట్టికి తేడా తెలియని వ్యక్తులు.. పేద ప్రజలు జగనన్న ఇళ్ల కోసం మట్టి తోలుకుంటుంటే నానా అల్లరి చేస్తున్నారు."- వల్లభనేని వంశీ, గన్నవరం ఎమ్మెల్యే
వెంకట్రావు ఏమన్నారంటే..?
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం టికెట్ తనదేనని ఆ పార్టీ నేత యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరం నియోజకవర్గంలోని ప్రతి సమస్యా తనకు తెలుసని.. వల్లభనేని వంశీ తమ పార్టీలో ఉన్నా జగన్ తనకే టికెట్ ఇస్తారని నమ్మకం ఉందని వెంకట్రావు అన్నారు.
తెదేపాలోకి వెళ్తున్నాననే వార్తలు అవాస్తవం. సీఎం జగన్, తెదేపా అధినేత చంద్రబాబులను నేను వ్యక్తిగతంగా ఎప్పుడూ తిట్టలేదు. ఈ నియోజకవర్గంలోని ప్రతి సమస్యా నాకు తెలుసు. వల్లభనేని వంశీ మా పార్టీలో ఉన్నప్పటికీ.. జగన్ నాకే టికెట్ ఇస్తారని నమ్మకం ఉంది - యార్లగడ్డ వెంకట్రావు
ఇవీ చూడండి