కొవిడ్ కారణంగా కొన్ని నెలలుగా బస్సు సర్వీసులు నిలిచిపోయాయని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు వెల్లడించారు. రాష్ట్ర విభజనకు ముందు 3.43 లక్షల కిలోమీటర్లు ఏపీ బస్సులను తిప్పామన్నారు. విభజన తర్వాత తెలంగాణలో ఏపీ బస్సులను 2.65 కిలోమీటర్లు తిప్పుతున్నామన్నారు. 71 రూట్లలో ఏపీ, 28 రూట్లలో తెలంగాణ బస్సులు తిప్పుతుందన్నారు. 1.1లక్షల కిలోమీటర్లు రెండు రాష్ట్రాల మధ్య గ్యాప్ ఉందని వెల్లడించారు.
"మేము 50 వేల కిలోమీటర్లు తగ్గిస్తాం. మీరు పెంచండి అని తెలంగాణ వాళ్ళను కోరాం. 1.10 లక్షల కిలోమీటర్ల నుంచి 1.60 లక్షల కిలోమీటర్ల వరకు పెంచడానికి తెలంగాణ ముందుకు వచ్చింది. అంతకుమించి పెంచే సామర్థ్యం లేదని..,లాభదాయకంగా ఉండదని తెలంగాణ చెబుతోంది" అని కృష్ణబాబు స్పష్టం చేశారు.
మరోసారి సమావేశం
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడిపేందుకు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీఎస్ఆర్టీసీకి అనుమతి ఉందని కృష్ణబాబు వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి రూట్ వైజ్ క్లారిటీ ఇవ్వాలని తెలంగాణ అడిగిందన్నారు. ఇప్పటి వరకు ఏ రాష్ట్రం ఇలాంటి ప్రతిపాదన పెట్టలేదన్నారు. దీని ద్వారా వచ్చే సమస్యలను పరిశీలిస్తామన్నారు. రెండు రోజుల్లో మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
70 వేల కిలోమీటర్లు మేర 250 బస్సులు తిప్పితే ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయని భావించామని కృష్ణబాబు వ్యాఖ్యనించారు. సర్వీసుల పునరుద్ధరణపై ప్రతిష్టంభన ఇలానే ఉంటే ప్రయివేట్‌కు లాభం చేకూరుతుందన్నారు. తుది నిర్ణయం తీసుకునే వరకు ఇరు రాష్ట్రాలు 250 బస్సుల చొప్పున నడిపేందుకు అనుమతి ఇవ్వాలని అడిగామన్నారు. అంతర్రాష్ట్ర బస్సులపై క్లారిటీ వచ్చినా తరువాతే అనుమతి ఇస్తామని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారని తెలిపారు.
రూట్ల వారీగా క్లారిటీ ఇస్తే ముందుకు
రూట్ల వారీగా రెండు రాష్ట్రాలు సమానంగా నడపాలని సూచించినట్లు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ తెలిపారు. రూట్లవారీగా క్లారిటీ ఇస్తేనే ముందుకు వెళ్తామన్నారు. రెండు రాష్ట్రాలు అగ్రిమెంట్ ప్రకారం ముందుకు వెళతామన్నారు.
ఇదీచదవండి