Justice for PRC: విజయవాడలో జస్టిస్ ఫర్ పీఆర్సీ పేరుతో ఉపాధ్యాయులు, పీడీఎఫ్, స్వతంత్ర ఎమ్మెల్సీలు నిరసన దీక్ష చేపట్టారు. పీఆర్సీ, గ్రాట్యుటీ, సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీతాలు పెంచకుండా తగ్గించడమేంటని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా పోరాటాన్ని సాగిస్తామని తెలిపారు.
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన స్పందన లేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు పెంచకుండా తగ్గించడం వింతగా ఉందన్నారు. సచివాలయ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆవేదనను పరిగణలోకి తీసుకోవాలని ఎమ్మెల్సీలు కోరారు. ప్రభుత్వమే వివాదాలు సృష్టించడం సరికాదని మొండిగా ముందుకు వెళితే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు.