TDP @ 40 Years: తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్రంలోనే కాకుండా ఇతర దేశాలలోని తెలుగుదేశం పార్టీ అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం, తెలుగు జాతి వికాసం కోసం తెదేపా పుట్టిందని పలువురు అన్నారు. తెలుగు ప్రజలు ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ సజీవంగా ఉంటుందన్నారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన తెదేపా అభిమానులు.. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబును మళ్లీ సీఎంను చేయటమే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఐర్లాండ్ లోని పలు ప్రాంతాల్లో: తెలుగుదేశం పార్టీ 40 వసంతాల వేడుకలను ఎన్ఆర్ఐ తెదేపా కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఎన్ఆర్ఐ తెదేపా యూరప్ విభాగం తరపున.. ఐర్లాండ్‌లోని డబ్లిన్, లిమెరిక్, కార్క్, గాల్వే నగరాల్లో తెలుగుదేశం పార్టీ అవిర్భావ పండుగను జరుపుకొన్నారు. 40 వసంతాల ఈ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగు యువత ప్రతినిధులు పాల్గొని తెదేపా వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండా ఎగురవేసి, కేక్ కట్ చేశారు.
నార్త్ కెరొలినాలో సంబరాలు: తెలుగుదేశం పార్టీ 40 వసంతాల వేడుకలను అమెరికాలో ఘనంగా నిర్వహించారు. నార్త్ కెరొలినా రాష్ట్రంలోని షార్లెట్ నగరంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు సమావేశమమై.. ఎన్నారై తెదేపా షార్లెట్ చాప్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకూ నెలకొన్న పరిస్థితులపై తమ అనుభవాలను గుర్తు చేసుకున్నారు.
మెల్‌బోర్న్‌లో అభిమానులు ర్యాలీ: తెలుగుదేశం పార్టీ 40వ సంతాల వేడుక సందర్భంగా మెల్‌బోర్న్‌లో పార్టీ అభిమానులు ర్యాలీ నిర్వహించి.. జై తెదేపా ఆకృతిని కార్లతో ప్రదర్శించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. 40 ఏళ్ల ప్రస్థానానికి సూచికగా అభిమానులు తమ కార్లను 40 అంకె ఆకృతిలో నిలిపారు.
లాస్ ఏంజెల్స్: దేశ విదేశాల్లో తెలుగుదేశం NRI అభిమానులు పార్టీ అవిర్భావ దినోత్సవాలు చేస్తున్నారు. అమెరికా వీధుల్లో కార్ ర్యాలీ నిర్వహించారు. లాస్ ఏంజెల్స్‌లో వర్షాన్నీ లెక్కచేయకుండా వేడుకలు చేశారు. పెద్ద ఎత్తున సంబరాల్లో పాల్గొన్నారు.
బోస్టన్: బోస్టన్‌లో తెలుగుదేశం ఆవిర్భావ వేడుకలను NRIలు ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేశారు. తెలుగువారి అభివృద్ధిలో పార్టీ భాగస్వామ్యాన్ని గుర్తుచేసుకున్నారు. పార్టీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తిప్పికొట్టాలని నిర్ణయించారు.
ఇదీ చదవండి: TDP 40TH ANNIVERSARY : రాజకీయ చైతన్యఝరికి 40 ఏళ్లు