ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సు ప్రమాదాలు చూశాక వాటిలో ప్రయాణమంటేనే ప్రజలు ఆలోచిస్తున్నారు. గుంతలమయమైన రోడ్లపై కాలం చెల్లిన బస్సులను నడుపుతుండటం వల్ల ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి ఘోరంగా తయారవడంతో ఆటోలు, ప్రైవేటు వాహనాలు నిలిపివేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో కండిషన్‌లో లేని ఆర్టీసీ బస్సులు(rtc bus) ఎక్కుతున్నాయి.. ప్రయాణికుల ఒళ్లు హునమవుతోంది.
పాత బస్సులకే రంగులు పూసి నడిపిస్తున్నారు..
నిబంధనల ప్రకారం పది లక్షల కిలోమీటర్లకుపైగా తిరిగిన బస్సులను ఆర్టీసీ పక్కన పెట్టాల్సి ఉంటుంది. రోడ్డు రవాణా సంస్థకు 9వేల 139 సొంత బస్సులుండగా.. అందులో 10లక్షల కిలోమీటర్లకుపైగా 4వేల588 బస్సులు తిరిగాయి. 12లక్షల కిలోమీటర్లకుపైగా తిరిగిన 2వేల800 బస్సులను సరకు రవాణాకు తరలించాల్సి ఉన్నా.. కొత్త బస్సులు లేకపోవడంతో.. పాతవాటికే(old buses) రంగులు పూసి, మరమ్మతులు చేసి సర్వీసులు నడిపిస్తున్నారు. ఏటా 2వేల కొత్త బస్సుల కొనుగోలుకు 300 కోట్ల వరకు కేటాయించే ప్రభుత్వం.. కొన్నేళ్లుగా దాన్ని నిలిపివేసిందని కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవాటిని తీసుకురాకపోతే ఏదైనా అనర్థం జరిగితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి..