పోలవరం పునరావాసంపై బుధవారం విజయవాడలో పీపీఏ సీఈవో సమీక్షించారు. రాబోయే వరద సీజన్ నాటికి కాఫర్ డ్యాం వల్ల ఎంతమేర ముంపు ఏర్పడుతుందో అంతవరకు పునరావాసం కచ్చితంగా పూర్తి చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, పోలవరం అథారిటీ కార్యదర్శి రంగారెడ్డి, ఈఎన్‌సీ నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు.. ఇతర అధికారులు హాజరయ్యారు.
ఇంకా ప్రాథమిక దశ దాటలేదు
పునరావాస కార్యక్రమాలు పూర్తి చేయలేకపోతే కాఫర్ డ్యాం మూసివేయలేమన్న అంశంపై చర్చ సాగగా...కాఫర్ డ్యాం నిర్మాణం ఆపడం కన్నా కూడా గడువు లోపు పునరావాస కాలనీలు పూర్తిచేయడమే మంచిదని సమావేశంలో తేల్చారు. మొత్తం 17,760 కుటుంబాలను తరలించాల్సి ఉందని.. అందులో ఎంతమంది కోసం కాలనీలు నిర్మాణంలో ఉన్నాయి, ఇప్పటికీ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాని నిర్వాసిత కుటుంబాల సంఖ్య ఎంతో చెప్పాలని చంద్రశేఖర్ అయ్యర్ అధికారులను ప్రశ్నించారు. దాదాపు 2వేల మందికి పైగా నిర్వాసిత కుటుంబాల ఇళ్ల నిర్మాణం ఇంకా ప్రాథమిక దశ దాటలేదని తేల్చారు. దానికి కార్యాచరణ ఏంటో తెలియజేయాలని ప్రశ్నించారు. ఇప్పటికే కాఫర్ డ్యాం రెండో గ్యాప్ మూసివేస్తున్నామని, మిగిలిన భాగం కూడా మూసివేయకుంటే ప్రవాహ వేగం, ఒత్తిడి పెరిగి.. ఉన్న కట్టడానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున కాఫర్ డ్యాం మొత్తం మూసివేసి పునరావాసం పూర్తి చేసుకోవడమే ఉత్తమ విధానమని ఇంజినీర్లు అభిప్రాయపడ్డారు.
కాలనీలు కట్టలేమా
దేశంలోనే గొప్పదైన పోలవరం డ్యాం కట్టగలిగిన వాళ్లం, పునరావాస కాలనీలు కట్టలేమా అని.. సమావేశంలో జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ప్రశ్నించారు. ప్రభుత్వం వైపు నుంచి పునరావాసానికి పూర్తి సహకారం అందిస్తామని, గడువులోపు పూర్తిచేస్తామని చెప్పారు. ఇప్పటికే రహదారులు భవనాలశాఖ వారికి అప్పగించిన కాలనీల నిర్మాణం పూర్తి చేసినందున.. మిగిలిన కాలనీల నిర్మాణమూ వారికి అప్పగించవచ్చు కదా అని అయ్యర్ ప్రశ్నించారు. ఇకపై జలవనరులశాఖ ఇంజినీరింగ్ అధికారులు పునరావాసం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని వినియోగిస్తామని అధికారులు చెబుతున్నారు. 15 రోజులకోసారి తాము సమీక్షిస్తామని, పక్కా కార్యాచరణ సాగేలా చూడాలని అథారిటీ పెద్దలు సూచించారు. తమనుంచి కూడా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని వెల్లడించారు.
ఇదీ చదవండి: రామతీర్థం ఘటనపై ఆగ్రహజ్వాలలు.. ప్రభుత్వ తీరుపై విమర్శలు