విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగుల అవస్థలు అన్నీఇన్నీ కావు. రక్తపరీక్షలు, వైద్యం కోసం వచ్చే బాధితులు, వారి బంధువులు నానా తిప్పలు పడుతున్నారు.
ఓపీ కార్డు కోసం కనీసం గంట
విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు అనేక జిల్లాల నుంచి రోగులు వస్తుంటారు. నిత్యం 'ఔట్ పేషెంట్' విభాగం వద్ద వెయ్యి మందికి పైగానే బారులు తీరతారు. ఓపీ కార్డు తెచ్చుకునేందుకు కనీసం గంట సమయం పడుతుంది. వైద్యుడి వద్దకు వెళ్లాక పరీక్షలు రాస్తే గంటల తరబడి క్యూలైన్లలో నిల్చోవాల్సిందే. వాటి ఫలితాలు వచ్చేసరికి సాయంత్రం, లేదంటే మరుసటి రోజు తిరిగి రావాల్సి వస్తోంది.
గంటకు పైగా నిరీక్షిణ
నగరానికి చెందిన ఓ వృద్ధుడు మధుమేహం పరీక్ష కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. ఓపీ కోసం గంటసేపు క్యూలైన్లో నిల్చున్నారు. వైద్యుడి వద్దకు వెళ్తే రక్తపరీక్ష చేయించుకు రమ్మన్నారు. రక్తపరీక్ష కోసం కౌంటర్ వద్ద నెంబర్ తీసుకోవాలి. గంటకు పైగా నిరీక్షించినా క్యూలైన్లో సగం దూరమే వెళ్లగలిగారు. ఎండలో వేచిచూడలేక పెద్దాయన అల్లాడిపోయారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి కుటుంబసభ్యులందరిదీ దాదాపుగా ఇదే పరిస్థితి.
ఒకే కౌంటర్ వద్ద పడిగాపులు
వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ఔట్ పేషెంట్లే కాకుండా.. ఇన్ పేషెంట్లు కూడా వస్తుంటారు. ఫలితంగా ల్యాబ్‌లు, ఎక్స్‌రే, స్కానింగ్ కేంద్రాల వద్ద గంటల తరబడి సమయం పడుతోంది. వైద్య పరీక్షల నెంబర్ కోసం అన్ని బ్లాకుల్లో ఉన్న రోగులూ ఒకే కౌంటర్ వద్ద పడిగాపులు పడుతున్నారు.
ఇదీ చదవండి: