తెలుగు జాతి ఆత్మగౌరవం, తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 96వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నేతలు నివాళులర్పించారు. విజయవాడ గొల్లపూడి వన్ సెంటర్లో దేవినేని ఉమామహేశ్వరరావు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఎన్టీఆర్ జయంతి వేడుకలను విజయవాడ ఎంపీ కేశినేని నాని కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి కార్యకర్త ఆత్మవిశ్వాసంతో పని చేయాలని నేతలు సూచించారు.
గుంటూరులో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ఎన్టీఆర్ చిత్ర పటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. పార్టీలు, మతాలకు అతీతంగా ప్రజలకు మేలు చేయాలనీ తెలుగుదేశం పార్టీ స్థాపించి పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని డొక్కా ప్రశంసించారు.
తూర్పుగోదావరి జిల్లాలో ఎన్టీఆర్ జయంతిని నాయకులు ఘనంగా నిర్వహించారు. పి.గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే నారాయణ మూర్తి, తెదేపా ఇన్చార్జ్ స్టాలిన్ బాబు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ సేవలు మరువలేనివని కొనియాడారు. ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్ళరేవు ఐ.పోలవరం ముమ్మడివరం కాట్రేనికోన మండలాల్లో తెదేపా నేతలు వృద్ధాశ్రమంలో పండ్లు, బట్టలు అందజేశారు.
కాకినాడలో ఎన్టీఆర్ జయంతి వేడుకలకు ఎమ్మెల్యే చినరాజప్ప, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు హాజరయ్యారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయకత్వంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా కృషి చేస్తామని చినరాజప్ప అన్నారు. రాజమహేంద్రవరం గ్రామీణ మండలం కాతేరులో తెదేపా నాయకుడు గంగి వీరహనుమంతరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. మహిళలకు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. వీరనారాయణ వెంకటేశ్వర థియేటర్ కూడలిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నివాళులర్పించారు. సినీ రంగం, రాజకీయరంగంలోనూ ఎన్టీఆర్ తనదైన ముద్ర వేసుకున్నారని కొనియాడారు.