berm park: విజయవాడ హరితా బెరం పార్కులో మద్యం ధరలు తగ్గించామంటూ బోర్డులు ఏర్పాటు చేయటం చర్చనీయాంశంగా మారింది. ఏపీ టూరిజం ఆధ్వర్యంలో విజయవాడలోని కృష్ణానది ఒడ్డున ఆహ్లాదకర వాతావరణంలో ఉన్న హరితా బెరం పార్కును నిర్వహిస్తున్నారు. ఇక్కడికి కేవలం విజయవాడ వాసులే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి పర్యాటకులు వస్తుంటారు.
ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారి దర్శనం చేసుకుని కొండ దిగువన ఉన్న హరితా బెరం పార్కుకు కుటుంబసమేతంగా నిత్యం వందలాది మంది వెళుతుంటారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ పార్కులో మద్యం ధరలు తగ్గాయంటూ స్వాగత ద్వారం నుంచి లోపలి వరకు అడుగడుగునా బోర్డులు ఏర్పాటుచేశారు. నడిచే మార్గంలో ఎక్కడ చూసినా మద్యం ఆఫర్ల బోర్డులు, పెద్దగా ఏర్పాటు చేసిన బీర్ బాటిల్స్ బొమ్మలు చూసి చిన్నపిల్లలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతున్నామని పర్యాటకులు వాపోతున్నారు. పార్కుకు వచ్చినట్లు లేదని బార్లోకి వెళుతున్నట్లు ఉందని, గతంలో ఎన్నడూ ఇలాంటి బోర్డులు ఇక్కడ చూడలేదని పర్యాటకులు ఆవేదన చెందుతున్నారు.
ఇదీ చదవండి:
YS Viveka murder Case: సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వివేకా కుమార్తె సునీత ఏం చెప్పారు?