పశ్చిమ గోదావరి జిల్లాలో...
కార్తిక మాసం మూడో సోమవారం కార్తిక పౌర్ణమి పర్వదినాన పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ శివాలయాలు భక్తుల శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తణుకు పాత ఊరులోని సిద్దేశ్వర స్వామి ఆలయానికి తెల్లవారుజాము నుంచి భక్తులు బారులు తీరారు. ప్రత్యేక పూజలు, పాలాభిషేకాలు చేశారు. ఆలయ ప్రాంగణాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
దెందులూరు నియోజకవర్గంలోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కార్తిక మాసంలో వచ్చే పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచి శివాలయంలో భక్తుల సందడి నెలకొంది. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆలయ ప్రాంగణంలో దీపోత్సవాలు నిర్వహించారు. ఆలయాల్లో స్వామి వార్లకు ప్రత్యేక అలంకరణలు, పూజలు జరిపించారు.
పంచారామ క్షేత్రం పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తిక మాసం మూడో సోమవారం సందర్భంగా పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయం భక్తజనంతో కిక్కిరిసింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఆలయంలో ఏర్పాట్లు చేశారు.
విశాఖ జిల్లాలో....
విశాఖ జిల్లాలో పవిత్రమైన శారదా నదిలో కార్తికమాసం మూడో సోమవారం సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి... దీపారాధన చేశారు. భక్తి శ్రద్ధలతో కార్తిక పౌర్ణమి వేడుకలు నిర్వహించారు.
కార్తిక మాసం మూడో సోమవారం సందర్భంగా మాడుగుల నియోజకవర్గంలోని శివాలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు. భక్తజన శివనామస్మరణ మధ్య ఉత్సవం కన్నుల పండువగా జరిగింది.
ఇదీ చదవండి: