అధికారంలోకి వస్తే 2 వేల కోట్ల ఇన్పుట్ సబ్సిడీ చెల్లిస్తామని చెప్పిన జగన్..మాట తప్పి రైతులను మోసం చేశారని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావ్ విమర్శించారు. వర్షాలతో పంట నష్టపోయి రైతులు కన్నీళ్లు పెడుతుంటే వైకాపా నేతలు ఇళ్లలోనే ఉండటం సిగ్గుచేటని మండిపడ్డారు. రైతు సమస్యలు వారికి పట్టవా..? అని ప్రశ్నించారు. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసిన వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 3.30 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. ఆ నష్టం నుంచి రైతులు కోలుకోకముందే ఈ వర్షాలకు మరో 2.2 లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని తెలిపారు.
ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలో పంట దెబ్బతిందని కళా చెప్పారు. ప్రభుత్వం వెంటనే పంట నష్టం అంచనా వేసి... పరిహారం చెల్లించి రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రకృతి విపత్తుల కింద నష్టపోయిన వివిధ పంటలకు తెదేపా ప్రభుత్వం నష్టపరిహారాన్ని 50 నుంచి 100 శాతం పెంచిందని గుర్తుచేశారు. వైకాపా ప్రభుత్వం మాత్రం కేవలం 15 శాతం పెంపునకే పరిమితమయ్యిందని దుయ్యబట్టారు. గత ఐదేళ్ల తెదేపా పాలనలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద 3 వేల 759.51 కోట్లు విడుదల చేశామన్నారు. 2019 జూన్ నుంచి 2020 జనవరి వరకు వైకాపా కేవలం 25 లక్షలు మాత్రమే విడుదల చేసిందన్నారు.
ఇదీచదవండి