విజయవాడలోని ప్రకాశం బ్యారేజీలోకి భారీగా వరదనీటి ప్రవాహాలు వచ్చే అవకాశాలున్నాయి. దాదాపు 9 లక్షల క్యూసెక్కుల వరద బ్యారేజీని తాకుతుందని జలవనరులశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువన పులిచింతల నుంచి 8.55 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతుండటంతో ఆ ప్రవాహాలు నేరుగా ప్రకాశం బ్యారేజీ రిజర్వాయర్‌కు చేరుకోనున్నాయి. దీంతో బ్యారేజీ ఎగువ, దిగువ ప్రాంతాల్లో మరింత స్థాయిలో నీటి మట్టం పెరుగనుంది.
ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నుంచి 6.39లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద భారీగా నీటి మట్టం పెరగనుంది. అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కృష్ణా జిల్లాలో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న 18 మండలాలు వరదనీటికి ప్రభావితం అయ్యే అవకాశం ఉన్నట్లు జిల్లా అధికారులు వెల్లడించారు. బ్యారేజీకి 9 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అధికారులను అదేశించారు.
అధికారుల సమీక్ష
కృష్ణా నది దిగువన...కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ముంపునకు గురైన ప్రాంతాల పరిస్థితిపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లు ముంపు ప్రాంతాన్ని కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుంటూరు జిల్లా కొల్లూరులో కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ పర్యటించారు. అనంతరం వరద ఉద్ధృతిపై అధికారులతో సమీక్షించారు.
ఇదీచదవండి