హైకోర్టు అనుమతితో రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ స్థలాల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేసిన ప్రజలు... నిమజ్జనాల నిర్వహణ విషయంలో ఆటంకాలు ఎదుర్కొంటున్నారు. మూడో రోజు చాలాచోట్ల గణేశ నిమజ్జనాలు మొదలవగా... పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. డప్పు చప్పుళ్లు, డీజీ మోతలతో శోభయాత్రలకు అనుమతి లేదనడం వివాదానికి కారణమైంది. పోలీసుల తీరును నిరసిస్తూ కర్నూలు జిల్లా గూడూరులో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, గణపతి భక్తులు పెద్దఎత్తున ఆందోళన చేశారు. నిమజ్జన కార్యక్రమంలో డీజేకు అనుమతి ఇవ్వాలంటూ పట్టుబట్టారు. హిందువుల పండుగల పట్ల వ్యతిరేక ధోరణి విడనాడాలన్నారు. సందడిగా నిర్వహించే నిమజ్జన ర్యాలీలకు పోలీసులు అనుమతి లేదనడంపై మండిపడ్డారు. రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కర్నూలు జిల్లా ఆత్మకూరులోనూ వినాయక నిమజ్జనాలకు పోలీసుల నుంచి ఆటంకం ఎదురైంది. డ్రమ్స్ వాయిద్యాల మధ్య యువకులు, పిల్లలు నృత్యాలు చేస్తూ శోభాయాత్ర చేస్తుండగా పోలీసులు అభ్యంతరం తెలిపారు. డ్రమ్స్‌కు అనుమతి లేదంటూ శోభయాత్రను అడ్డుకున్నారు. ఆగ్రహించిన గణేశుడి భక్తులు పోలీసుల వైఖరిని నిరసిస్తూ బైఠాయించారు. చాలాసేపటి తర్వాత పోలీసులు అనుమతించడంతో ఉత్సాహంగా శోభాయాత్ర కొనసాగించారు.
గుంటూరు జిల్లా కాకుమాను మండలం గరికపాడులో వినాయక నిమజ్జనం సందర్భంగా ఉద్రిక్తత చోటుచోసుకుంది. డప్పుల సందడితో వెళ్తున్న వినాయక శోభాయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. డప్పులకు అనుమతి లేదన్న పోలీసులుశోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాల్లో ఐదుగురి కంటే ఎక్కువ మంది పాల్గొనడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. పోలీసుల తీరును నిరసిస్తూ మహిళలు, యువతీ, యువకులు రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. హిందూ సంప్రదాయంపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం వైకాపా వర్గీయులు డప్పు చప్పుళ్లతో కార్యక్రమం నిర్వహిస్తే అనుమతించిన పోలీసులు ఇవాళ అభ్యంతరం చెప్పడమేంటని ప్రశ్నించారు.
ఇదీ చదవండి.