కృష్ణా జిల్లాలోని ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆదాయం పక్కదారి పడుతోంది. గతంలో ప్రభుత్వానికి ఇచ్చిన విజిలెన్స్ నివేదికలోనూ అక్రమాల గురించి స్పష్టంగా పేర్కొన్నారు. అన్నదానంలోనూ లెక్కలు తారుమారు చేస్తున్నట్టు గుర్తించారు. సరకులు విక్రయించే గుత్తేదారుతోనూ ఒప్పందాలు చేసుకుని.. బియ్యం, ఇతర పదార్థాల నాణ్యతను తగ్గించి.. రెండు, మూడో క్వాలిటీని తెప్పించి.. ఆ మేరకు తమ జేబుల్లో వేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. అందుకే ప్రసాదాల నాణ్యత విషయంలోనూ గత కొంతకాలంగా భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటే.. ఇలాంటి వాటికి చెక్ పెట్టొచ్చని నాలుగైదేళ్ల కిందట ఒకరిద్దరు అధికారులు ప్రయత్నాలు చేశారు. తమ ఆదాయానికి గండిపడుతుందని కొంతమంది సిబ్బంది దీనిని అడ్డుకున్నారనే విమర్శలున్నాయి.
ఇంజినీరింగ్, పరిపాలనలో మాయ..
పదేళ్లలో దుర్గగుడి ఇంజినీరింగ్ విభాగం చేసిన విన్యాసాలు అన్నీఇన్నీ కావు. అవసరం లేకపోయినా.. ఏదో ఒక నిర్మాణం కట్టడం.. మళ్లీ దాన్ని కూలగొట్టడం.. తిరిగి కట్టడం.. ఇదే తంతు. చివరికి ఇప్పుడు చూస్తే.. కొండపై ఆలయం తప్ప మరో నిర్మాణం లేకుండా ఊడ్చేశారు. ఈవోలు మారిన ప్రతిసారీ అభివృద్ధి పేరు చెప్ఫి. ఏదో ఒక కొత్త టెండర్ పిలిచి.. ఉన్న డబ్బులు కరిగించేందుకు నిర్మాణాలు చేస్తూనే ఉంటారు. అన్నీ తాత్కాలిక అవసరాలే తప్ఫ. భక్తులకు ఉపయోగపడే శాశ్వత ప్రాతిపదికన ఒక్కటీ చేపట్టలేదు. కేవలం తమ రాబడి కోసం తప్ఫ. ఎందుకు కడతారో.. ఎందుకు కూలగొడతారో.. కనీసం అధికారులకైనా అవగాహన ఉందా.. లేదా.. అనేది సందేహం. ప్రస్తుతం రూ.70 కోట్ల ప్రభుత్వ నిధులతో మళ్లీ నిర్మాణాలు చేపట్టేందుకు టెండర్లు పిలుస్తున్నారు. కనీసం వీటినైనా పక్కా ప్రణాళికతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపడితే.. బాగుంటుంది.
ఆలయంలోని పరిపాలన విభాగం పరిస్థితి కూడా ఇలాంటిదే. టెండర్ల దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ.. వారి స్వప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. ఈ విభాగంలో దీర్ఘకాలంగా పాతుకుపోయి ఉన్న కొంతమంది సిబ్బందే వీటన్నింటికీ ప్రధాన కారణం. ఈవోలు మారినా.. వీళ్లు మాత్రం ఇక్కడే ఉంటూ.. చక్రం తిప్పుతూ ఉంటారు. కనీసం అంతర్గత బదిలీల్లోనూ వీరిని మార్చే సాహసం ఏ అధికారీ చేయరు. అంతలా వీరి నుంచి లబ్ధి పొందుతుంటారనే ఆరోపణలున్నాయి.
ఇక్కడెన్నో అవకతవకలు..
దుర్గగుడి చీరల విభాగంపైనా కొన్నేళ్లుగా తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండేళ్ల కిందట చీరల లావాదేవీల్లో చేతివాటం ప్రదర్శించిన ఓ ఉద్యోగిపై వేటు వేశారు. రూ.70 లక్షలకు పైగా విలువైన చీరలను పక్కదారి పట్టించినట్టు అప్పట్లో అంతర్గత తనిఖీల్లో భాగంగా దుర్గగుడి అధికారులే లెక్కలు తేల్చారు. కానీ.. ఈ విషయం తర్వాత పట్టించుకోకుండా వదిలేశారు. రూ.2 వేల నుంచి రూ.50 వేలకు పైగా విలువైన పట్టు చీరలను అమ్మవారికి భక్తులు సమర్పిస్తూ ఉంటారు. వీటన్నింటికి సంబంధించిన లెక్కల్లో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తుంటారు. విలువైన చీరలపై ఉన్న ధరల స్టిక్కర్లను మార్చేయడం వంటివి చేస్తుంటారనే ఆరోపణలున్నాయి. ఈ విభాగాన్ని కదిలిస్తే.. భారీగా అవకతవకలు బయటపడేందుకు అవకాశం ఉంది.
ఇదీ చదవండి:
ఓపిక లేకున్నా.. ఓటు హక్కు వినియోగించుకున్న 115 ఏళ్ల వృద్ధురాలు