కరోనా ప్రభావం రక్తనిధి కేంద్రాలపై అధికంగా చూపుతోంది. గతంలో నిత్యం 30 మంది వరకు రక్తదానం చేస్తామంటూ వచ్చే స్వచ్ఛంద రక్తదాతలు.. నేడు నలుగురు కూడా రావటమే కష్టంగా మారిందని రక్తనిధి కేంద్ర నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్లడ్ క్యాంప్ లు లేక స్వచ్ఛంద దాతలు ముందుకు రాకపోవటంతో రక్త నిల్వలు అడుగంటి పోతున్నాయన్నారు.
'బ్లడ్ టు లైవ్' వెబ్ సైట్ నిర్వాహకుల కార్యక్రమాలు
రక్తదాన ఆవశ్యకతను ప్రజలకు తెలిపేందుకు 'బ్లడ్ టు లైవ్' వెబ్ సైట్ నిర్వాహకులు వినూత్న కార్యాక్రమాన్ని చేపట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో పర్యటించి రక్తదానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కరపత్రాలను పంచుతున్నారు. రక్త దానం ఆవశ్యకతను, దాని విలువలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. రక్తదాతలు ముందుకు రావాలని కోరుతున్నారు.
రక్తం ప్యాకెట్ల కొరత
రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 10వేల మంది తలసేమియా బాధితులుంటారు. నెలకు రెండు సార్లు వారికి రక్తం ఎక్కించాల్సి ఉంటుందని రక్తినిధి కేంద్రాల ప్రతినిధులు చెపుతున్నారు. వీరితో పాటు గర్భిణులు, కాన్సర్ రోగులు , ఓపెన్ సర్జరీలు చేసేవారికి రక్తం అవసరమవుతుందని తెలిపారు. ప్రస్తుతం రక్తం ప్యాకెట్ల కొరత తీవ్రంగా ఉందని చెబుతున్నారు. సాధారణ రోజుల్లో విద్యార్ధులు, కార్పోరేట్ సంస్థలు ముందుకు వచ్చి రక్తదాన శిబిరాల ద్వారా రక్తదానం చేసేవారు.
దాతలు ముందుకు రావటం లేదు
ప్రస్తుతం కరోనా వ్యాప్తి కారణంగా విద్యార్ధులు, యువత ముందుకు రావట్లేదని రక్తనిధి కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి రక్తదానం చేసి... ఆదుకోవాలని పలువురు పిలుపునిస్తున్నారు.రక్తం సేకరించే సమయంలో కరోనా నిబంధనలు పాటిస్తున్నామని రక్తనిధి క్యాంపు నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చదవండి: