రాష్ట్రంలో రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్న పరిస్థితులు నెలకొన్నందున రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు కోరారు. మంచి వ్యవస్థలుగా పేరొందిన సీఐడీ, ఏసీబీలు జగన్మోహన్ రెడ్డి చర్యలతో దిగజరిపోతున్నాయని విమర్శించారు. కక్ష సాధింపు చర్యలు, సైకో ప్రవర్తనలతో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుంటే.. ప్రధాని, కేంద్ర హోంశాఖ స్పందించకపోతే ఎలా ? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబుని ఉద్దేశించి జగన్ మాట్లాడిన పలు వీడియోలను అయ్యన్న మీడియాకు విడుదల చేశారు.
క్షత్రియులపై కక్ష సాధింపు చర్యలు ఆపకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు హెచ్చరించారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని వేసిన పిటిషన్ ఈ నెల 17న విచారణకు వస్తున్నందున..,కేసు వాదించకుండా న్యాయవాదుల్ని భయపెట్టేందుకే రఘురామకృష్ణరాజుని అరెస్టు చేశారన్నారు.