AP Rajbhavan at Home: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజ్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2019లో ఈ కార్యక్రమం జరిగింది. కరోనా కారణంగా రెండేళ్ల పాటు ఈ కార్యక్రమం రద్దు అయింది. ప్రస్తుతం కరోనా పరిస్థితులు కొంతమేర తగ్గుముఖం పట్టడంతో ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం జగన్ దంపతులు, తెదేపా అధినేత చంద్రబాబు, అధికార, ప్రతిపక్ష నేతలు, న్యాయమూర్తులు, సీనియర్ అధికారులు, త్రివిద దళాల ప్రతినిధులు ఇతర ప్రముఖులు ఎట్ హోంకు హాజరయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్‌కుమార్ మిశ్రా దంపతులు గవర్నర్‌కు అభినందనలు తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ ఇచ్చే తేనీటి విందు కార్యక్రమంలో అధికార, ప్రతిపక్ష నేతలతోపాటు రాజకీయ పార్టీల నేతలు పరస్పర అభినందనలు తెలియజేసుకోవడం, ఒక దగ్గర కూర్చోవడం, పరస్పరం మాట్లాడుకోవడం, గవర్నర్‌తో కలిసి అంతా ఓ ఫొటో దిగడం పరిపాటిగా వస్తోంది. ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ హయాంలోనూ ఈ సంప్రదాయం కొనసాగింది. ఈ మూడేళ్ల కాలంలో ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు హాజరైన సందర్భం ఇదే కావడం విశేషం. ఇరువురు ఒకరికి ఒకరు ఎదురుపడే అవకాశం ఉంటుందని అందరూ భావించారు. కానీ అలాంటివి ఏమీ లేకుండా ఇద్దరూ వారికి కేటాంచిన స్థానాల్లో కూర్చుండిపోయారు. తేనీటి విందు అనంతరం ఎవరికి వారు వెనుదిరిగారు.