తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠను ప్రపంచ వ్యాప్తం చేసేందుకు కృషి చేస్తానని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయంలో జరిగిన తప్పిదాలన్నిటినీ బయటకు తీస్తామని స్పష్టం చేశారు. ఛైర్మన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయన తొలిసారిగా ఒంగోలు వచ్చారు. స్థానిక సంతపేట ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవాస్థానం కళ్యాణ మండపం పనులను పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. గత పాలక మండలి హయంలో నగదు, నగలు దుర్వినియోగంపై దర్యాప్తు నిర్వహిస్తామని, దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని ఆయన అన్నారు.
తిరుమల కొండపై అక్రమాలకు తావు లేకుండా నిఘా పెంచుతామని తెలిపారు. సామాన్య భక్తులు గంటలకొద్దీ క్యూలైన్లలో వేచివుండే పరిస్థితి రాకూడదని.. రెండు గంటల్లో దైవదర్శనం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొత్త పాలకవర్గం ఏర్పాటు విషయంలో న్యాయపరమైన కొన్ని చిక్కులున్నాయని.. దీనిపై నిపుణులతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.