నేడు మనం మరచిపోతున్న అర్ష సంపదలైన రామాయణం, మహాభారతం, భాగవతం, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలను యువతకు అందించేందుకు తితిదే పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తోందని తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక వసంత మండపంలో నిర్వహించిన రామాయణంలోని యుద్ధకాండ రావణ సంహారం సర్గల పారాయణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ధర్మాన్ని ఆచరించేవారిని ధర్మమే కాపాడుతుందనే విషయం రామాయణం మనకు తెలుపుతుందని ఈవో ఏవీ ధర్మారెడ్డి అన్నారు. ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి కూడా త్వరలో అంతమై పోతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ జూన్ 11వ తేదీ నుంచి యుద్ధకాండ పారాయణం నిర్వహిస్తున్నట్లు ధర్మగిరి వేదవిజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ కుప్పా శివసుబ్రహ్మణ్యం అవధాని తెలిపారు. ఇందులో భాగంగా మంగళవారం రావణ సంహారంలో 109 నుంచి 114 వరకు ఉన్న 270 శ్లోకాలను పారాయణం చేసినట్లు చెప్పారు. రావణ సంహారం సందర్భంగా మహిళలు, వేదపండితులు, అర్చకులు, అధికారులు స్వామివారికి ప్రత్యేక మంగళ హారతులు సమర్పించారు. అనంతరం రామ విజయోత్సవ కీర్తనలను అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు శ్రీరాముడిపై రచించిన కీర్తనలతో సప్తగిరులు పులకించాయి.
ఆకట్టుకున్న సెట్టింగులు
తితిదే గార్డెన్ విభాగం ఆధ్వర్యంలో అశోకవనంలో సీతమ్మవారు, ఆంజనేయస్వామివారి సెట్టింగ్ ఏర్పాటుచేశారు. రామరావణ యుద్ధం సందర్భంగా హనుమంత వాహనంపై కత్తి, గధ, విల్లు, ఈటే వంటి ఆయుధాలు, అస్త్రాలు ధరించిన శ్రీరామచంద్రమూర్తి, ఆశ్వవాహనంపై లక్ష్మణ స్వామి, విల్లంబులతో యుద్ధం చేస్తున్న పది తలల రావణుడు, యుద్ధ సన్నివేశాలతో ఫ్లెక్సీలు ఆకట్టుకున్నాయి. ప్రవేశద్వారం ముందు విష్వక్సేనులవారు, ఆయుధాలు ధరించిన ఆంజనేయస్వామి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇదీ చదవండి: