తిరుపతి రూయా ఆసుపత్రి వార్డుల ఎదుట మృతుల బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. సకాలంలో ఆక్సిజన్ తెప్పించుకోవడంలో వైద్యులు నిర్లక్ష్యంగా ప్రవర్తించారని బాధితుల బంధువులు ఆరోపించారు. ఇంత జరిగినా... వైద్యులు, సిబ్బంది తీవ్రతను గుర్తించలేదని వాపోయారు. వార్డుల్లో తమవారి ప్రాణాలు పోగొట్టుకున్న సహాయకులు ఆగ్రహానికి లోనయ్యారు. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా విధ్వంసానికి పాల్పడ్డారు. వైద్యులు, సిబ్బందిపై వాగ్వాదానికి దిగారు. పరిస్థితి అదుపు తప్పడంతో నర్సులు, ఇతర సిబ్బంది మరుగుదొడ్లలోకి వెళ్లి తలదాచుకున్నారు. వందలాది మందితో ఆస్పత్రి ప్రాంగణం నిండిపోయింది. అర్ధరాత్రి వరకు కూడా వార్డుల ఎదుట బంధువులు ఎదురుచూపులతో కనిపించారు. ఘటన చోటు చేసుకున్న రుయాలో కొవిడ్ వార్డులను పోలీసులు దిగ్భందం చేశారు. మృతుల బంధువులను వార్డులోకి అనుమతించకుండా నిలువరించారు. ఆస్పత్రి రెండు వైపుల మార్గాల్లో ఎవరినీ వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. తమవారికి ఏమైందంటూ..తెలుసుకునే ప్రయత్నం చేసినా అనుమతించలేదు. ఘటనను కలెక్టరు హరినారాయణన్, ఎస్పీ వెంకట అప్పల నాయుడు, జేసీ వీరబ్రహ్మం, కమిషనరు గిరీష, మేయర్ డాక్టర్ శిరీష, స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ, హెచ్‌డీఎస్ వర్కింగ్ ఛైర్మన్ చంద్రశేఖర్, రుయా పర్యవేక్షకురాలు డాక్టర్ భారతి పరిశీలించారు.
‘సామాజిక మాధ్యమాల్లో భయపెట్టొద్దు’
రుయాలో ఆక్సిజన్ సరఫరాలో ప్రెజర్ తగ్గడంతో 11 మంది చనిపోయారు. ఈ ఘటనను ఉపయోగించుకుని సామాజిక మాధ్యమాల్లో భయపెట్టే విధంగా చేయడం మంచిది కాదని తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు అన్నారు. ఘటనపై విచారణ చేపడతామని, ఏదైనా ఉంటే 1902కి ఫోన్ చేసి సమాచారం పొందవచ్చని ఆయన సూచించారు. రుయా ఘటనపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని, బాధితులు, బంధువులు ఆందోళన చెందవద్దని తిరుపతి ఎంపీ గురుమూర్తి చెప్పారు. ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని భాజపా రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్‌రెడ్డి కోరారు. రుయాలో ఆక్సిజన్ కొరతతో కరోనా రోగులు మరణించడం బాధాకరమని, ప్రాణవాయువు సరఫరాపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ సూచించారు. రుయా ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెదేపా తిరుపతి పార్లమెంటరీ అధ్యక్షుడు నరసింహయాదవ్ డిమాండ్ చేశారు. రుయాస్పత్రి ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే కరోనా మరణాలకు దారితీసిందని సీపీఎం నాయకులు కందారపు మురళి ఆరోపించారు.
ఇదీ చదవండి: