తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలను తితిదే ఏకాంతంగా నిర్వహించనుంది. ఈ నెల 24 నుంచి 26 వరకు మూడు రోజులపాటు ఇవి వైభవంగా జరగనున్నాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
వసంతోత్సవం నిర్వహించే సేవల సమయాలు:
మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కల్యాణమండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఆస్థానం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు స్వామి, అమ్మవార్లను ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగిస్తారు.
మొదటి రెండు రోజులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి, మూడో రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం, ఊరేగింపు నిర్వహిస్తారు.
నిలిపివేసిన సేవల వివరాలు..
ప్రతి ఏడాది ఆలయానికి వెనకవైపునున్న వసంత మండపంలో నిర్వహించే ఈ ఉత్సవాన్ని.. ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా నిబంధనలు పాటిస్తూ ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఈ కారణంగా వసంతోత్సవాల్లో రెండో రోజు నిర్వహించే స్వర్ణ రథోత్సవాన్ని తితిదే రద్దు చేసింది. వసంతోత్సవాలు జరిగే మూడు రోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను దేవస్థానం రద్దు చేసింది.
ఇవీ చదవండి: