తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు రాష్ట్ర ప్రగతికి మలుపని.. ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ప్రచారం నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తిరుపతి కాంగ్రెస్కు కంచుకోటని.. 16 సార్లు ఎన్నికలు జరిగితే.. 12 పర్యాయాలు కాంగ్రెస్ గెలిచిందని గుర్తుచేశారు. ఎంపీ అభ్యర్థి చింతా మోహన్ ఆరుసార్లు విజయం సాధించారని తెలిపారు. ప్రాంతీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మలుగా మారాయని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. బాబు, జగన్, పవన్ కలయికే భాజపా అని విమర్శించారు.
కాంగ్రెస్కు ప్రధాన ప్రతిపక్షం భాజపా అని తులసిరెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్లో 22 మంది ఎంపీలున్న వైకాపా.. ఇప్పటివరకు రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏమీలేదని విమర్శించారు. దైవసాక్షిగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పిన భాజపా.. వెంకటేశ్వరస్వామిని మోసం చేసిందని విమర్శలు గుప్పించారు. ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయం అని.. పుదుచ్చేరికి తెరిచిన అధ్యాయం అని భాజపా ప్రభుత్వం ప్రకటించడం దారుణమన్నారు. జనసేన జనం లేని సేన అని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదాపై పవన్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ... పరిషత్ ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై ఎస్ఈసీ ఆరా